కాంగ్రెస్‌ హిందూ వ్యతిరేకి

11 Sep, 2022 06:04 IST|Sakshi
కన్యాకుమారిలో యాత్ర మధ్యలో టీ తాగుతున్న రాహుల్‌

పాస్టర్‌తో రాహుల్‌ సంభాషణే రుజువు

వీడియో విడుదల చేసిన బీజేపీ

విద్వేషాలను రెచ్చగొట్టేందుకే: కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: భారత్‌ జోడోయాత్రలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతో క్రైస్తవ మతపెద్ద ఒకరు మాట్లాడినట్లు వెలుగులోకి వచ్చిన ఓ వీడియోపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్‌ హిందూ వ్యతిరేక వైఖరి బయటపడిందంటూ బీజేపీ మండిపడింది. జార్జి పొన్నయ్య అనే పాస్టర్‌ శుక్రవారం రాహుల్‌తో మాట్లాడిన వీడియోను బీజేపీ నేతలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

‘‘యేసు ప్రభువు దేవుడా, కాదా? మీరెలా భావిస్తారు?’ అని రాహుల్‌ ప్రశ్నించగా, ‘‘యేసు ప్రభువు నిజమైన దేవుడు. మానవుడిగా భూమిపై జీవించారు. ఆయన శక్తి దేవతల్లాంటి వారు కాదు’’ అంటూ పొన్నయ్య బదులిచ్చారు. భారత్‌ జోడో యాత్ర అసలు రంగు ఈ వీడియోతో బయట పడిందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా అన్నారు. నవరాత్రులు ప్రారంభం కానున్న వేళ శక్తి దేవతను ఇలా అవమానించడం దారుణమని మండిపడ్డారు. ‘‘హిందూ దైవాలను అవమానించడం కాంగ్రెస్‌ పార్టీకి కొత్తేమీ కాదు. గతంలో రాముడి ఉనికిని ప్రశ్నించింది.

ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసం రాహుల్‌ హిందువుగా నటిస్తుంటారు. ఒక వర్గాన్ని బుజ్జగించడానికి మరో మతాన్ని కించపర్చడం ఏమిటి?’’ అని నిలదీశారు. పొన్నయ్య గతంలో హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసి అరెస్టయ్యాడని బీజేపీ నేత షెహజాద్‌ పూనావాలా అన్నారు. బీజేపీ విమర్శలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం తిప్పికొట్టారు. ‘‘బీజేపీ విద్వేషాల ఫ్యాక్టరీ. తద్వారా పబ్బం గడుపుకోవడమే దాని పని. యాత్రకు స్పందన చూసి ఓర్వలేకపోతోంది’’ అంటూ ట్వీట్‌ చేశారు. భారత్‌ జోడో యాత్ర స్ఫూర్తిని ఎవరూ దెబ్బతీయలేరని, కుట్రదారులకు భంగపాటు తప్పదని అన్నారు.

కేరళలోకి ప్రవేశం
భారత్‌ జోడో యాత్ర శనివారం తమిళనాడు నుంచి కేరళలో అడుగు పెట్టింది. అంతకుముందు కన్యాకుమారి జిల్లాలో తమిళనాడు తొలి మహిళా బస్‌ డ్రైవర్, మార్తాండంలో మహిళా పారిశుద్ధ్య కార్మికులతో రాహుల్‌ మాట్లాడారు. నారాయణ గురు జయంతి నాడు కేరళలో అడుగుపెట్టడం సంతోషంగా ఉందన్నారు.

మరిన్ని వార్తలు