దళితులను మోసగిస్తున్న కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి: తరుణ్‌ చుగ్‌

30 Oct, 2022 02:54 IST|Sakshi
దళితుల ఆత్మీయ సమ్మేళనంలో డప్పుకొడుతున్న తరుణ్‌ చుగ్, సంజయ్, రాజగోపాల్‌రెడ్డి

మునుగోడు: ఎనిమిదేళ్లుగా దళితులను మోసగిస్తున్న సీఎం కేసీఆర్‌కు మునుగోడు ఉప ఎన్నికలో దళితులు బుద్ధి చెప్పాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ తరుణ్‌ చుగ్‌ పిలుపునిచ్చారు.  శనివారం మునుగోడులో నిర్వహించిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానని, ఆ వర్గాలకు మూడు ఎకరాల భూమి, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇస్తానని చెప్పి నిలువునా ముంచాడని విమర్శించారు.

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వేళ అక్కడి దళితులకు దళితబంధు ఇచ్చారని, ఇప్పుడు మునుగోడు ప్రజలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ మోసపూరిత హామీలు గుర్తుపెట్టుకుని మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి పట్టం కట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్‌ అగౌరవ పరిస్తే.. రాష్ట్రపతి పదవి ఒకమారు దళితుడికి, ఒకమారు గిరిజన మహిళకు కట్టబెట్టిన ఘనత బీజేపీదే అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. 12 మంది దళితులకు మంత్రి పదవులు ఇచ్చిన ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు.

సీఎం కేసీఆర్‌ దళిత వ్యతిరేకి..: సీఎం కేసీఆర్‌ దళిత వ్యతిరేకి అని బీజేపీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌కు కూడా అహంకారం ఎక్కువైందని విమర్శించారు. నవంబర్‌ 6న మునుగోడు ఎన్నిక ఫలితం అనంతరం కేసీఆర్‌ కుటుంబం అంతా జైలుకు వెళ్లక తప్పదన్నారు. బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బాష అ«ధ్యక్షతన జరిగిన సభలో హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ మునుస్వామి, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి, మాజీ మంత్రి బాబుమోహన్, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, గంగిడి మనోహర్‌ రెడ్డి, రవీందర్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు