ఒక్కసారి అధికారం ఇవ్వండి

12 Sep, 2021 04:01 IST|Sakshi
మాట్లాడుతున్న బండి సంజయ్, చిత్రంలో జాతీయ కార్యదర్శి కైలాష్‌ విజయ్‌ వర్గీయ, ఈటల, బాబూమోహన్‌  

ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి విజ్ఞప్తి 

జోగిపేటలో సాగిన ప్రజా సంగ్రామ యాత్ర

జోగిపేట/వట్‌పల్లి(అందోల్‌): టీఆర్‌ఎస్‌తో కలిసే పార్టీ కాదు.. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దెదించే పార్టీ బీజేపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చేరుకున్న సందర్భంగా హనుమాన్‌ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ.. జోగినాథస్వామి ఆశీస్సులతో సీఎం గడీల కోటను బద్ధలుకొట్టాలని పిలుపునిచ్చారు. ఫామ్‌హౌస్, ప్రగతిభవన్‌ తప్ప.. రాష్టంలో పాలన పడకేసిందని ఎద్దేవా చేశారు.

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రజలు బీజేపీకి పట్టంకడితే.. పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేంద్రం రాష్ట్రానికి 3 లక్షల ఇళ్లను కేటాయిస్తే.. కేసీఆర్‌ ఇప్పటికి ఇచ్చింది 12వేలేనని మండిపడ్డారు. ముఖ్యమంత్రి దళితబంధుకు నిధులను ఎక్కడి నుంచి ఇస్తాడో స్పష్టం చేయాలన్నారు. ధనిక రాష్ట్రమని చెప్పిన సీఎం.. రూ.4 లక్షల కోట్లు అప్పులు చేశాడని ఆరోపించారు. అంబేడ్కర్‌ను అవమానించిన పార్టీ కాంగ్రెస్‌ అని పేర్కొన్నారు.

హుజూరాబాద్‌లో బీజేపీ గెలుస్తుందని, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పవర్‌కట్‌ చేస్తామని చెప్పారు. ఢిల్లీకి పోయి వంగి, వంగి దండాలు పెట్టి వచ్చిన కేసీఆర్‌.. పోయి ఫౌంహౌస్‌లో పడుకున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ అవినీతి పాలనను అంతం చేయడానికే సంజయ్‌ పాదయాత్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్‌ విజయ వర్గీయ అన్నారు. టీఆర్‌ఎస్‌ వచ్చాక యువతకు ఉద్యోగాలు వచ్చాయా? నిరుద్యోగ భృతి వచ్చిందా? అని ప్రశ్నించారు.  

మరిన్ని వార్తలు