Hyderabad Politics: పాతబస్తీలో బీజేపీ పాగా వేస్తుందా?.. వ్యూహం ఇదేనా?

24 Aug, 2022 17:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరం మినీ భారతదేశం. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలతో పాటు.. ఉత్తరాదివారు ఎక్కువగా నివసించే నగరం హైదరాబాద్‌. పైగా మైనారిటీలు కూడా అధికంగా ఉండే ప్రాంతం. ఇక్కడ ఒక్కో నియోజకవర్గం వైవిధ్యభరితంగా ఉంటుంది. సామాజిక సమీకరణాల్లో కూడా విభిన్నమైన నగరం. అందుకే ఏ పార్టీ అయినా హైదరాబాద్‌ నగరాన్ని గెలవాలనుకుంటుంది. వచ్చే ఎన్నికల్లో రాజధాని నగరం మీద ఏ పార్టీ పట్టు సాధించే అవకాశం ఉంది. పోటీలో నిలిచేదెవరు? గెలిచేదెవరు? రాజధాని రాజకీయాలపై సాక్షి ప్రత్యేక కథనాలు.
చదవండి: ‘రాజాసింగ్‌  సస్పెన్షన్‌ పెద్ద డ్రామా.. కేంద్ర పెద్దల హస్తం ఉందా?’

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో రాజకీయాలు ఊపందుకున్నాయి. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తెలంగాణ సెంటిమెంట్‌కు అతీతంగా హైదరాబాద్ ప్రజల తీర్పు ఉంటోంది. పాతబస్తీలోని 7 నియోజకవర్గాల్లో మజ్లిస్ పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది. న్యూ సిటీలోని 8 సెగ్మెంట్లలో ఆధిపత్యం కోసమే అన్ని పార్టీలు పోరాడుతున్నాయి. ఇందుకోసం అప్పుడే కసరత్తు కూడా ప్రారంభించేశాయి. కోటికి పైగా ఉన్న జనాభాతో నగరం కిక్కిరిసి ఉండటంతో పార్టీల ప్రచారం కూడా అంతే స్థాయిలో ఉంటుంది.

చాలా సెగ్మెంట్లలో టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, మజ్లిస్‌ పార్టీల మధ్య త్రిముఖ పోరు హోరా హోరీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రేటర్‌ నగరపాలక సంస్థ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో డివిజన్లు సాధించుకున్న కాషాయ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బలం నిరూపించుకోవాలని తహతహలాడుతోంది. అదేవిధంగా పార్టీల్లో టిక్కెట్ల కోసం పోటీ కూడా ఎక్కువగానే ఉంది. గత ఎన్నికల్లో గోషామహల్‌ సీటులో బీజేపీ విజయం సాధించింది. మిగిలిన ఏడు సీట్లు టీఆర్ఎస్‌ గెలుచుకుంది. ప్రస్తుతం పోటీ తీవ్రంగా ఉన్నందున  గులాబీ పార్టీ కొందరు సిటింగ్‌లను మారుస్తుందనే ప్రచారం సాగుతోంది.

పాతబస్తీలోని సీట్లను గెలవడం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు కష్టమే అయినప్పటికీ ఈ పార్టీలు సీరియస్‌గానే ప్రయత్నిస్తున్నాయి. అదే వ్యూహంతో బీజేపీ ఎమ్మెల్యేలు లేవనెత్తుతున్న సున్నిత అంశాలు కూడా చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు, దానిపై వెల్లువెత్తిన నిరసనలు, పార్టీలోనే అసంతృప్తి.. ఇవన్నీ కూడా ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు.

ఇన్నాళ్లు పాత బస్తీని ప్రయోగ క్షేత్రంగా తీసుకున్న బీజేపీ నేతలు ఇప్పుడు ఎలాగైనా అక్కడ పాగా వేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పాతబస్తీకి బ్రాండ్ అంబాసిడర్ చార్మినార్‌కు కూతవేటు దూరంలో ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయం నుంచే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏ కార్యక్రమాన్నయినా చేపడుతున్నారు. హోంమంత్రి అమిత్‌షా, ఢిల్లీ నుంచి ఏ ప్రముఖులు వచ్చినా ఇక్కడ పూజలు నిర్వహించడం వల్ల బీజేపీ ఓ వర్గం ఓట్లన్నింటిని కేంద్రీకృతం చేసే వ్యూహాంలో ఉన్నట్టు కనిపిస్తోంది.

న్యూ సిటీలోని సెగ్మెంట్లలో టీఆర్ఎస్ అసంతృప్త నేతలు, కార్పోరేటర్లను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్‌, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీలలో ఇప్పటికే టిక్కెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ప్రతీ నియోజకవర్గంలో కనీసం ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. అన్ని పార్టీలు తమ బలాలు, బలహీనతలపై అంతర్గత సర్వేలు చేయించుకుంటున్నాయి. సర్వేలో వెల్లడైన సానుకూల అంశాలు, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని టిక్కెట్లు కేటాయించేందుకు సిద్ధం అవుతున్నాయి. దీంతో రాజధాని నగర రాజకీయం వేడెక్కుతుంది.

మరిన్ని వార్తలు