‘ఖాసీం చంద్రశేఖర్‌ రజ్వీని గద్దె దింపుతాం’

19 Sep, 2022 04:08 IST|Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు ఓటు వేస్తే మజ్లిస్‌కు వేసినట్లే

బీజేపీకి అవకాశమిస్తే నీతివంతమైన పాలన అందిస్తాం

మల్కాజిగిరి (హైదరాబాద్‌): నిరంకుశ పాలన చేస్తున్న ఖాసీం చంద్రశేఖర్‌ రజ్వీ (కెసీఆర్‌)ని గద్దె దింపుతామని బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. సంజయ్‌ నాలుగో విడవ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆదివారం మల్కాజిగిరి వెంకటేశ్వరనగర్‌ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా మల్కాజిగిరి చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో 1,450 మంది ప్రాణ త్యాగం చేశారన్నారు. కానిస్టేబుల్‌ కిష్ణయ్య, శ్రీకాంతాచారి లాంటి పేదవాళ్లు ప్రాణత్యాగం చేస్తే వచ్చిన రాష్ట్రాన్ని పెద్దోడు ఏలుతున్నారని అన్నారు. ప్రజలు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే మజ్లిస్‌కు వేసినట్లేనన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌లకు అవకాశమిచ్చారని.. ఒక్కసారి బీజేపీకి అవకాశమిస్తే మోదీ నాయకత్వంలో నీతివంతమైన పాలన అందిస్తామని పేర్కొన్నారు. కేంద్రం 2.4 లక్షల ఇళ్లు కేటాయిస్తే ఈ ప్రాంతం వారికి ఒక్కటైనా వచి్చందా? అని ప్రశ్నించారు. ఎంఎంటీఎస్‌ కోసం కేంద్రం రూ.600 కోట్లు కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం తనవంతు నిధులు మంజూరు చేయలేకపోయిందన్నారు. మల్కాజిగిరిలో టీఆర్‌ఎస్‌ నాయకులు భూ కబ్జాలకు పాల్పడ్డారన్నారు. సమస్యలపై ప్రశి్నస్తే టీఆర్‌ఎస్‌ నాయకులు దాడులకు పాల్పడుతున్నారన్నారు. ప్రజల కోసం ఎన్ని కేసులైనా ఎదుర్కొంటామని, ఎన్ని సార్లయినా జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. 

కేసీఆర్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలి..: నాలుగువేల ఐదువందల మంది ప్రాణత్యాగం చేస్తే తెలంగాణకు నిజాం నుంచి విముక్తి లభించిందని బండి సంజయ్‌ అన్నారు. తెలంగాణ మహిళలను వివస్త్రలు చేసి ఆటాడిపించిన రజాకార్లు, నిజాంకు వత్తాసు పలుకుతున్న కెసీఆర్‌కు సిగ్గులేదన్నారు. దీనికి కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. దారుసలాం నుంచి ఒవైసీ.. కేసీఆర్, కేటీఆర్‌లకు కృతజ్ఞతలు చెబుతున్నాడంటే ప్రభుత్వం ఎవరి కనుసైగల్లో నడుస్తున్నదో ప్రజలు గమనించాలన్నారు. పాతబస్తీలో పాకిస్తాన్‌ జెండాలు పట్టుకున్న చేతులు ఈ రోజు జాతీయ జెండాను పట్టుకున్నాయంటే బీజెపీ వల్లనే నన్నారు. ఎస్టీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న కెసీఆర్‌.. ఇన్ని రోజులు కేంద్రం అడ్డుకుందని చెప్పి వారిని మోసగించారన్నారు. గిరిజనులకు పోడుభూములకు పట్టాలు ఇవ్వని కేసీఆర్, వారు పండించుకున్న పంటను సైతం నాశనం చేసి.. మహిళలను కూడా అరెస్ట్‌ చేశారన్నారు. ఎస్టీ సోదరులు ఈ సంఘటనలు గుర్తుంచుకోవాల్సిన అవసరముందన్నారు. కాగా, ఈ సందర్భంగా కురుమ రిజర్వేషన్‌ పోరాట సమితి నాయకులు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని బండి సంజయ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విజయరామారావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, కార్పొరేటర్లు శ్రవణ్, రాజ్యలక్ష్మి, సునీతా యాదవ్, జిల్లా అధ్యక్షుడు హరీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఈడీ లేకుంటే బీజేపీనే లేదు

మరిన్ని వార్తలు