Maha Political Crisis: శివసేన రెబల్స్‌కు బీజేపీ భారీ ఆఫర్‌!.. సంజయ్‌ రౌత్‌ కీలక ప్రకటన

23 Jun, 2022 12:59 IST|Sakshi
ఫైల్‌ ఫొటో

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో మహా రాజకీయ పరిణామాలు పూట పూటకు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోవచ్చనే ఊహాగానాల నడుమ.. శివ సేన కీలక నేత సంజయ్‌ రౌత్‌ తాజా  ప్రకటన మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలోనే పరిస్థితి సర్దుమణుగుతుందని ఆయన మీడియాకు చెప్పడం విశేషం.   ఈ తరుణంలో.. దొరికిన అవకాశం చేజార్చుకోవద్దని బీజేపీ భావిస్తోంది. 

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ వ్యూహం రచిస్తోంది. అస్సాం నుంచే ఇది మొదలైనట్లు తెలుస్తోంది. ఏక్‌నాథ్ షిండేతో సహా మహారాష్ట్ర తిరుగుబాటు ఎమ్మెల్యేలు బస చేసిన గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్‌కు అస్సాం మంత్రి అశోక్ సింఘాల్ చేరుకున్నారు. ఈ మేరకు సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. శివ సేన రెబల్స్‌ గనుక తమతో చేతులు కలపాలని, బదులుగా భారీగా పోర్ట్‌పోలియో వాళ్ల ముందు ఉంచినట్లు తెలుస్తోంది. రెబల్స్‌ గనుక తమతో కలిసి వస్తే.. ప్రభుత్వంలో ఎనిమిది కేబినెట్‌ మంత్రి పదవులు, ఐదు సహాయక మంత్రి పదవులు ఆఫర్‌ చేసింది. ఒకవేళ శివ సేన ఎంపీలు గనుక వస్తే.. కేంద్రంలో రెండు మంత్రి పదవులు ఇస్తామని చెప్పినట్లు భోగట్టా. 

ఇదిలా ఉంటే.. సీఎం ఉద్దవ్‌ థాక్రేను కలవకుండానే.. ఏక్‌నాథ్‌ షిండే మూడు పేజీల లేఖ రాయడం కలకలం రేపుతోంది. అయితే.. మహా వికాస్‌ అగాఢీ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏం లేదని సంజయ్‌ రౌత్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. రెబల్స్‌లోనే 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, వాళ్లు ముంబైకి రాగానే పరిస్థితి సర్దుమణుగుతుందని రౌత్‌ ప్రకటించడం గమనార్హం. 

ఈడీకి భయపడి శివసేనకు ద్రోహం చేయాలనుకుంటున్నారు. అలాంటి వాళ్లు బాల్‌థాక్రే అనుచరులు, నిజమైన శివ సైనికులు కాలేరంటూ సంజయ్‌ రౌత్‌ మీడియాతో వ్యాఖ్యానించారు. బలపరీక్ష ఎప్పుడు జరుగుతుందో అందరూ చూస్తారు, పార్టీని వీడే వారు బాలాసాహెబ్ భక్తులు కాదు.. ఇవాళ సీఎం ఉద్దవ్‌ థాక్రే ఎలాంటి భేటీ నిర్వహించబోవడం లేదంటూ వ్యాఖ్యానించాడాయన.

చదవండి: ప్రజలు చస్తుంటే.. రాజకీయాలు చేస్తున్నారా..?

మరిన్ని వార్తలు