వర్షాలతో విరామం.. కరీంనగర్‌లో మొదలైన రాజకీయ వేడి

20 Jul, 2022 17:47 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: ఉమ్మడి జిల్లా రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో దాదాపు 10 రోజులపాటు రాజకీయంగా కాస్త విరామం వచ్చింది. రాజకీయంగా అత్యంత కీలకమైన జిల్లా కావడంతో వర్షాల అనంతరం తిరిగి పొలిటికల్‌ హీట్‌ పెరగనుంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు పాత జిల్లాలో విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నాయి.

వరద బాధితులను పరామర్శించేందుకు ఒకవైపు వైఎస్సార్‌టీపీ, 24న మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా చేపట్టే సేవా కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ నేతలు, భారీ వర్షాల కారణంగా రద్దైన రాహుల్‌ సభ (సిరిసిల్ల డిక్లరేషన్‌)ను అదే రోజు నిర్వహించాలని కాంగ్రెస్‌ శ్రేణులు, ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ మహా సంగ్రామయాత్రకు భారీగా తరలివెళ్లాలని కమలనాథులు.. ఇలా ఎవరి ప్రణాళికల్లో వారు తలమునకలయ్యారు. ఇందులో వైఎస్సార్‌టీపీది ఆకస్మిక పర్యటన షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతోంది. కానీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ముందస్తుగా అనుకున్న కార్యక్రమాలన్నీ అనివా ర్య కారణాల వల్ల రూటు మార్చుకుంటున్నాయి.
చదవండి: తెలంగాణలో బియ్యం సేకరణ నిలిపివేతపై కేంద్రం వివరణ

మంథనిలో షురూ..!
భారీ వర్షాల అనంతరం రాజకీయాలు అన్నీ వరద బాధితులపైనే తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వరద ప్రభా విత ప్రాంతాలైన పెద్దపల్లి జిల్లా మంథనిలోని పలు గ్రామాలను సందర్శించనున్నారు. అక్కడ బాధితులతో సమావేశమై సమస్యలు తెలుసుకోనున్నారు. వాస్తవానికి గత నెలలోనే వైఎస్‌ షర్మిల కరీంనగర్‌ జిల్లాకు రావాల్సి ఉండగా, అని వార్య కారణాల వల్ల రద్దయింది. గోదా వరి పరి వాహక ప్రాంతాల్లో వర్షాలు, వరదల ప్రభావం అధికంగా ఉండటంతో ఆమె ఉమ్మడి జిల్లాలో తీవ్రంగా దెబ్బతిన్న మంథనిని ఎంచుకున్నారు.

సిరిసిల్ల రాహుల్‌ సభ రీ షెడ్యూల్‌?
వరంగల్‌ డిక్లరేషన్‌ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ కన్నేసిన రెండో ఉమ్మడి జిల్లా కరీంనగర్‌. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతోపాటు యువతను ఆకట్టుకోవాలన్న లక్ష్యంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆగస్టు 2న సిరిసిల్లలో రాహుల్‌ సభకు ఏర్పాట్లు చేశారు. సభకు రాష్ట్రవ్యాప్తంగా భారీ జనసమీకరణ చేయాలని టీ కాంగ్రెస్‌ యోచించింది. కానీ, ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో చాలాప్రాంతాల్లో వరదలు వచ్చాయి. దీంతో సభను వాయిదా వేయాలని పార్టీ నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఢిల్లీ పెద్దలకు కూడా వివరించారు. అక్కడ నుంచి ఇంకా ఆమోదం రాలేదు. అయితే, అనుకున్న తేదీనే రాహుల్‌ సభ నిర్వహించాలని ఉమ్మడి కరీంనగర్‌ నేతలు అభిప్రాయ పడుతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చే సంకేతాల ఆధారంగా సభ నిర్వహణపై స్పష్టత రానుంది.

‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ ఇంకోవిధంగా..!
భారీవర్షాల నేపథ్యంలో ఈనెల 24న కేటీఆర్‌ జన్మదిన వేడుకల్లో మునపటి సందడి ఉండకపోవచ్చని పార్టీ నేతలు అంటున్నారు. ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా అంబులె న్స్‌లు, దివ్యాంగులకు బైకులు, వివిధ ఉపకరణాలు అందజేసే ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ వరద బాధితులకు చేయూతనిచ్చేలా కొనసాగుతుందని కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామక్రిష్ణారావు తెలి పారు. ఈసారి వరద ప్రభావిత ప్రాంతాలను ఆదుకునే దిశగా కార్యక్రమాలు రూపొందించే పనిలో ఉన్నామని వివరించారు.

బండి సంగ్రామయాత్ర వాయిదా..!?
ఆగస్టు 2న ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టబోయే మూడో విడత మహా సంగ్రామయాత్రకు ఉమ్మడి కరీంనగర్‌ కమలనాథులు సిద్ధమవుతున్నారు. యాత్ర ఆసాంతం వరకు సంజయ్‌కు చేదోడువాదోడుగా ఉండేవారిలో ఉమ్మడి జిల్లావారే అధికం. ఈ నేపథ్యంలో సంగ్రామయాత్రలో వీరికి అప్పగించే బాధ్యతలు, నిర్వర్తించాల్సిన విధులపై ముమ్మర కసరత్తు సాగుతోంది. అదే సమయంలో ఆగస్టు 2న బండి యాత్ర కూడా వాయిదా పడే అవకాశాలూ కనిపిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమైతే బండి యాత్ర యథావిధిగా జరుగుతుందని, పోలింగ్‌ నిర్వహించాల్సి వస్తే ఆగస్టు 6 తరువాత తేదీలకు యాత్ర మారే అవకాశాలు ఉన్నాయని సీనియర్‌ కమలనాథులు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు