ఆ స్క్రీన్‌షాట్లు బయటకు వస్తే మోదీ ప్రజలకు మొహం చూపించలేరు

18 Sep, 2022 16:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. అవినీతి నెపంతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కమలంపార్టీ అణచివేయాలని చూస్తోందని ఆరోపించారు. బీజేపీకి గుజరాత్‌లో ఓడిపోతామనే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.

ఢిల్లీలో పార్టీ ప్రతినిధులతో ఆప్ నిర్వహించిన తొలి జాతీయ సదస్సులో మాట్లాడుతూ ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు కేజ్రీవాల్. తమ ఎమ్మెల్యేలు, మంత్రులపై మోదీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి అవినీతికి పాల్పడ్డారని అప్రతిష్టపాలు చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ఆప్‌కు గుజరాత్‌లో లభిస్తున్న ఆదరణను చూసి బీజేపీ జీర్ణించుకోలేకపోతుందని దుయ్యబట్టారు.

ఆప్‌కు కవరేజీ ఇవ్వొద్దని..
అంతేకాదు గుజరాత్‌లో ఆప్‌కు కవరేజీ ఇవ్వొద్దని పలు టీవీ ఛానళ్లను మోదీ సలహాదారుడు హిరేన్ జోషి బెదిరించారని కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకవేళ తాను చెప్పినట్లు చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని జోషి హెచ్చరించినట్లు పేర్కొన్నారు.

బీజేపీ ఆప్‌పై ఇలాంటి చర్యలు మానుకోవాలని కేజ్రీవాల్ హితవుపలికారు. టీవీ ఎడిటర్లకు జోషి పంపిన సందేశాల స్క్రీన్‌షాట్లు బయటకువస్తే ఆయనతో పాటు మోదీ కూడా దేశ ప్రజలకు మొహం చూపించలేరని వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో ఆప్‌ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యేలను కొంటూ మాపై ఆరోపణలా..
బీజేపీ ఒకవైపు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ.. మరోవైపు తమపై అవినీతి ఆరోపణలు చేయడానికి ఎంత ధైర్యమని కేజ్రీవాల్ ప్రశ్నించారు. గత 75 ఏళ్లలో బీజేపీ అతిపెద్ద అవినీతి ప్రభుత్వంగా అవతరించిందని ధ్వజమెత్తారు. ఆప్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరాలని బీజేపీ వేధిస్తోందని, లేకపోతే ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌లాగే అందర్నీ అరెస్టు చేస్తామని బెదిరిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు.
చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్‌..? స్పందించిన యూనివర్సిటీ

మరిన్ని వార్తలు