బీజేపీ ‘ఇ–రావణులు’ను రంగంలోకి దించింది: అఖిలేష్‌

1 Aug, 2021 01:56 IST|Sakshi

సామాజిక వేదికల్లో మత విద్వేషం చిమ్మేందుకు, పార్టీ ప్రచారానికి బీజేపీ వ్యూహరచన

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ వ్యాఖ్య

లక్నో: వచ్చే సంవత్సరం మొదలుకానున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల రణరంగంలో విజయం సాధించేందుకు భారతీయ జనతా పార్టీ ‘ఇ–రావణుల’ను రంగంలోకి దించిందని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపించారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌ వంటి సామాజిక మాధ్యమాల వేదికపై మత విద్వేషం చిమ్మేందుకు బీజేపీ పథకరచన చేసిందని అఖిలేశ్‌ చెప్పారు. తప్పుడు వార్తలు వ్యాప్తి చేసేందుకు బీజేపీ రావణులు సిద్ధంగా ఉన్నారని, వారి వలలో పడకుండా ఎస్‌పీ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. సమాజ్‌వాదీ నేతలపై దుష్ప్రచారానికి బీజేపీ కంకణం కట్టుకుందని, ఎస్‌పీ నేతలంతా మంచి నడవడికతో మెలగాలని సూచించారు. ‘రాక్షస రాజు రావణుడి తరహాలో సోషల్‌ మీడియాలో అబద్ధాలు, పుకార్లను పుట్టించి, యూపీ అంతటా ప్రచారం చేసేందుకు ఇ–రావణులను బీజేపీ తీసుకొచ్చింది’అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిలేశ్‌ వ్యాఖ్యానించారు.

‘కొందరు బీజేపీ నేతలు.. సమాజ్‌వాదీ పార్టీ నేతలుగా చెలామణి అవుతూ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యానాలు చేస్తూ వాటికి మరింత ప్రచారం కల్పిస్తారు. ఇలాంటి వారి పట్ల ఎస్‌పీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి అభ్యంతరకర పోస్టులను సరిచూసుకోకుండా మన కార్యకర్తలెవరూ వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయకండి. షేర్‌ చేయకండి. తప్పుడు పోస్ట్‌లపై ఎప్పటికప్పుడు పార్టీ కార్యాలయంలో ఫిర్యాదు చేయండి’ అని కార్యకర్తలకు అఖిలేశ్‌ సూచించారు. కొందరు అఖిలేశ్‌ యాదవ్‌ అధికారిక ట్విట్టర్‌ ఖాతా అంటూ ఒక నకిలీ అకౌంట్‌ను సృష్టించి, దాని ద్వారా మత విద్వేష వ్యాఖ్యానాలు, అంశాలను సోషల్‌ మీడియాలో ప్రచారం కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా అఖిలేశ్‌ గుర్తుచేశారు. ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ గత వారం ఫిర్యాదు కూడా చేసింది. ‘యూపీలో సమాజ్‌వాదీ పార్టీ మళ్లీ అధికారంలోకి రాగానే అయోధ్యలో రామ మందిరం ఉన్న చోటే బాబ్రీ మసీదు నిర్మించనుంది’ అని పేర్కొన్న ట్వీట్ల స్కీన్‌షాట్లను ఆధారంగా చూపుతూ ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్‌ ఉత్తమ్‌ పోలీసులకు ఫిర్యాదుచేయడం తెల్సిందే. 

‘యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ యూపీలో అభివృద్ధిని గాలికొదిలేసింది. మరెన్నో సమస్యలు అలాగే ఉన్నాయి. వీటన్నింటి నుంచీ ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ నాయకత్వం ఎలాంటి దిగజారుడు పనులైనా చేస్తుంది. మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోవడమే బీజేపీ లక్ష్యం. ఎంతటి అబద్దాలనైనా నిజాలుగా నమ్మించి జనాలను మళ్లీ ఫూల్స్‌ చేయాలని చూస్తారు. జాగ్రత్త’ అని అఖిలేశ్‌ రాష్ట్ర ప్రజలను సున్నితంగా హెచ్చరించారు. ‘అబద్ధాలు చెప్పేసి బీజేపీ 300 సీట్లు గెలవగలిగింది. అలాంటప్పుడు ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన రాష్ట్ర అభివృద్ధిని చూపించి మనం అంతకంటే ఎక్కువ సీట్లను గెలవగలం. వచ్చే ఎన్నికల్లో ఎస్పీ 350 సీట్లను గెలుస్తుంది’ అని అఖిలేశ్‌ ధీమాగా చెప్పారు.   

మరిన్ని వార్తలు