‘కేసీఆర్, కేటీఆర్‌లకు నిద్రపట్టడం లేదు’

16 May, 2022 09:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ బహిరంగ సభ విజయ వంతం కావడంతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ కు నిద్ర పట్టడం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షు రాలు డీకే అరుణ ఎద్దేవాచేశారు. ప్రజలకిచ్చిన హామీలు ఏమయ్యాయని అమిత్‌ షా సభలో అడిగిన ప్రశ్నలకు సరైన బదులివ్వకుండా కేటీఆర్‌ అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘కేటీఆర్‌ నువ్వు సిగ్గు పడాలి. ప్రధానిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా? టీఆర్‌ఎస్‌ నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దోచుకుంటోంది’ అని ధ్వజమె త్తారు.

ఆదివారం అరుణ విలేకరులతో మాట్లాడు తూ బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రకు వచ్చిన విశేష స్పందన చూసి ఒక పిచ్చి కుక్క మాదిరిగా స్థాయిని మరిచి కేటీఆర్‌ మాట్లాడుతు న్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘సభలో అమిత్‌ షా నూటికి నూరు శాతం కరెక్ట్‌ మాట్లాడారు. మీరు డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు ఎక్కడ ఇచ్చారో చెప్పండి. కేటీఆర్‌ కుటుంబం అవినీతి కుటుంబం. అమిత్‌ షా కాలి గోటికి కూడా మీరు సరిపోరు. 2014 నుంచి 2022 దాకా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.69 వేల కోట్లు పెట్రోల్, డీజిల్‌ ట్యాక్స్‌ రూపంలో వసూలు చేసింది. పోలీస్‌ వ్యవస్థను నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు. మీకు దమ్ముంటే పోలీసులు లేకుండా ఊర్లో తిరగండి’ అంటూ అరుణ సవాల్‌ చేశారు.  

అమిత్‌ షా గారడీ: బాల్క సుమన్‌
సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణపై మాయల ఫకీర్‌ లా దండయాత్రకు వచ్చారని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణపై ఏమాత్రం అభిమానం, ప్రేమ లేని బీజేపీ నాయకులు అమిత్‌షాతో తుక్కుగూడలో గారడీ చేయించారని ధ్వజమెత్తారు.

మొన్న రాహుల్‌ గాంధీ, నిన్న అమిత్‌షాల ప్రసంగాల్లో తెలంగాణ నినాదం ఊసు కూడా లేదని, రాహుల్‌ బీజేపీని, అమిత్‌షా కాంగ్రెస్‌ను ఏమీ అనకుండా టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేయడం ఆ పార్టీల కుట్రను తేటతెల్లం చేస్తోందన్నారు. లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ నేత నామా నాగేశ్వర్‌రావు  ఆర్టికల్‌ 370 రద్దుకు మద్దతుగా పార్లమెంట్‌లో మాట్లాడితే వ్యతిరేకించారని, అమిత్‌షా అబద్ధాలు చెప్పారని సుమన్‌ మండిపడ్డారు. మంత్రి కేటీఆర్‌ ఉద్యమంలో పాల్గొని ప్రభుత్వంలో భాగస్వామ్యం పంచుకుంటే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. క్రికెట్‌ కూడా ఆడటం రాని అమిత్‌ షా కొడుకు బీసీసీఐ పదవిలో ఎలా ఉంటాడని నిలదీశారు.  

మరిన్ని వార్తలు