ఐదారేళ్లలో బీజేపీ కనుమరుగవుతుంది.. బిహార్‌ నుంచే పతనం మొదలైంది..

24 Aug, 2022 16:05 IST|Sakshi

గవహటి: ఆల్‌ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్‌) ఎమ్మెల్యే కరీముద్దిన్‌ బర్భూయా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో ఐదారేళ్లలో బీజేపీ కనుమరుగు అవుతుందన్నారు. బిహార్‌ నుంచే ఆ పార్టీ పతనం ప్రారంభమైందని పేర్కొన్నారు.  బీజేపీనీ ప్రజలు మరోసారి అంగీకరించే పరిస్థితి లేదని చెప్పారు.

అలాగే కాంగ్రెస్‌ నాయకులు చాలా మంది తమ పార్టీలో చేరుతారని చెప్పారు ఈ అసోం ఎమ్మెల్యే. సెప్టెంబర్‌లో భారీగా చేరికలుంటాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న ఓడ అని ఈ  ఏడాది ఏప్రిల్‌లోనే వ్యాఖ్యానించారు కరీముద్దిన్. అసోంలో బీజేపీని గద్దె దించడం ఇక ఏఐయూడీఎఫ్‌కే సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు. రిపున్ బోరాను పీసీసీ చీఫ్‌గా తొలగించడంపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలో బలహీనపడుతోందని అభిప్రాయపడ్డారు.

మరోవైపు అసోంలో పలువురు కాంగ్రెస్ నేతలు టీఎంసీలో చేరారు. ఈ ఏడాది మేలోనే పలువురు కీలక నేతలు పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏఐయూడీఎఫ్ బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని కరీముద్దిన్‌ చెబుతున్నారు.

బిహార్‌లో బీజేపీకి షాక్ ఇస్తూ ఎన్డీఏ కూటమి నుంచి సీఎం నితీశ్ కుమార్ వైదొలిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఆర్జేడీ, కాం‍గ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
చదవండి: గుజరాత్‌లో బీజేపీ పాలనపై తీవ్ర వ్యతిరేకత.. ఈసారి కాంగ్రెస్‌దే విజయం..

మరిన్ని వార్తలు