కట్‌మనీ సంస్కృతిని అంతం చేస్తాం

19 Feb, 2021 05:16 IST|Sakshi
సుబ్రతా బిశ్వాస్‌ ఇంట్లో భోజనం చేస్తున్న అమిత్‌ షా, బీజేపీ నేతలు

బెంగాల్‌లో పరివర్తన్‌ యాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

బీజేపీ అధికారంలోకి వస్తే అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట

కాక్‌ద్వీప్‌/డైమండ్‌ హార్బర్‌: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ) ప్రభుత్వం కట్‌మనీ సంస్కృతిని తీసుకొచ్చిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కట్‌మనీ సంస్కృతిని అంతం చేస్తామన్నారు. బీజేపీ చేపట్టిన పరివర్తన్‌ యాత్ర పరమార్థం ఒక ముఖ్యమంత్రిని, ఒక మంత్రిని, ఒక ఎమ్మెల్యేను మార్చడం కాదని.. అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేయడం, బెంగాల్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమేనని స్పష్టం చేశారు. బెంగాల్‌ను సోనార్‌ బంగ్లాగా(బంగారు బంగ్లా) మార్చడానికే బీజేపీ పోరాటం చేస్తోందన్నారు. తమ బూత్‌స్థాయి కార్యకర్తలకు, టీఎంసీ సిండికేట్‌కు మధ్య ఈ పోరాటం సాగుతోందని తెలిపారు. అమిత్‌ గురువారం బెంగాల్‌లో మరో దశ పరివర్తన్‌ యాత్రను ప్రారంభించారు.

మేనల్లుడి కోసమే ముఖ్యమంత్రి ఆరాటం
బెంగాల్‌లో అంఫన్‌ తుపాను బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం పంపించిన నిధులను టీఎంసీ నేతలు కాజేశారని అమిత్‌ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తే తుపాన్లు, పర్యావరణ విపత్తుల నుంచి ప్రజలను కాపాడడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నారు. పాఠశాలల్లో సరస్వతి పూజను మమతా బెనర్జీ అడ్డుకున్నారని దుయ్యబట్టారు. బెంగాల్‌లో రాజకీయ హింస కారణంగా 130 మందికిపైగా బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎంసీ గూండాల ఆగడాలు ఇకపై సాగవని హెచ్చరించారు.

బీజేపీ కార్యకర్తలను హత్య చేసిన అరాచక శక్తులను కటకటాల వెనక్కి పంపిస్తామన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలను పక్కనపెట్టి, కేవలం ఆమె మేనల్లుడి సంక్షేమం కోసమే పని చేస్తున్నారని ఆక్షేపించారు. బెంగాల్‌లో సిండికేట్‌ పాలనను అంతం చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి రాగానే 7వ వేతన సవరణ సంఘం సిఫార్సులను అమలు చేస్తామన్నారు. అమిత్‌ షా గురువారం 24 పరగణాల జిల్లాలోని నారాయణపూర్‌ గ్రామంలో బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన సుబ్రతా బిశ్వాస్‌ ఇంట్లో భోజనం చేశారు. ఈ గ్రామంలో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్‌ హార్బర్‌ లోక్‌సభ స్థానం పరిధిలో ఉంది.

కట్‌మనీ అంటే?
బెంగాల్‌లో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను వర్తింపజేయడానికి అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ప్రజల నుంచి వసూలు చేస్తున్న కమిషన్‌ను కట్‌మనీగా వ్యవహరిస్తున్నారు. అంటే ఏదైనా పథకం కింద లబ్ధి పొందాలంటే అధికార పార్టీ నాయకులకు వారు అడిగినంత ముట్టజెప్పాల్సిందే. లేకపోతే అనర్హులవుతారు. 

మరిన్ని వార్తలు