నిజాం ఆస్తులు ప్రజలకే..

31 Aug, 2021 01:18 IST|Sakshi
‘ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మూడోరోజు సోమవారం హైదరాబాద్‌లో పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. చిత్రంలో  సీనియర్‌ నేత స్వామిగౌడ్‌ తదితరులు 

మేమొస్తే వాటిని స్వాధీనం చేసుకొని తిరిగి ప్రజలకు అప్పగిస్తాం 

దేశద్రోహుల పార్టీ ఎంఐఎంను తరిమికొడతాం 

మూడోరోజు ‘ప్రజా సంగ్రామ యాత్ర’లో బండి సంజయ్‌ 

సాక్షి, హైదరాబాద్‌/లంగర్‌హౌస్‌: ‘బీజేపీ అధికారంలోకి వస్తే నిజాం ఆస్తులు, భూములను స్వా ధీనం చేసుకుంటాం’అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ప్రకటించారు. పరాధీనంలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకుని వాటిని తిరిగి ప్రజలకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ‘ప్రజా సంగ్రామ యాత్ర మూడోరోజైన సోమవారం సాయంత్రం ఆరెమైసమ్మ ఆలయం వద్ద నిర్వహించిన సభలో ప్రజలనుద్దేశించి బండి సంజయ్‌ ప్రసంగించారు. ‘భాగ్యలక్ష్మీ అమ్మ వారి సాక్షిగా ఎంఐఎం అడ్డాను బద్దలు కొట్టిన సత్తా బీజేపీ కార్యకర్తలదే. పాతబస్తీనే కాదు.. వాళ్లు సవాల్‌ చేస్తే ఏ బస్తీకైనా వచ్చి కాషాయ జెండా ఎగరేస్తాం. టీఆర్‌ఎస్‌కు ఆ దమ్ము ఉందా?

దేశద్రోహుల పార్టీ ఎంఐఎంతో కేసీఆర్‌ దోస్తీ చేస్తున్నా రు. కేసీఆర్‌ పాతబస్తీకి రావాలంటే ఎంఐఎం పర్మిషన్‌ తీసుకోవాలి. రాబోయే ఎన్నికల తరువాత దేశద్రోహుల పార్టీని తరిమికొడతాం. భాగ్యనగర్‌ అమ్మవారి పేరుతోనే భాగ్యనగర్‌ పేరొచ్చింది. గొల్ల కురుమల కొండ గొల్లకొండనే... అది గోల్కొండ కాదు. నిజాం స్థలాలు, ఆస్తులన్నీ కూడా మావే. హిందువుల స్థలాలను ఆక్రమించుకుని నిజాం ఆస్తులుగా చెప్పుకుంటున్నారు’అని అన్నారు.  

కుటుంబం చేతిలో తెలంగాణ తల్లి బందీ 
తెలంగాణ ఇచ్చిన వీరుడు సర్దార్‌ పటేల్‌ ముందు మోకరిల్లిన పార్టీ బీజేపీ అని, తెలంగాణ ప్రజల మానప్రాణాలను దోచుకుని హింసించిన నిజాం రాజు ముందు మోకరిల్లిన పార్టీ టీఆర్‌ఎస్‌దని బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏనాడూ ఎంఐఎం సమర్థించలేదన్నారు. తెలంగాణ తల్లి ఒక కుటుంబం చేతిలో బందీ అయ్యిందని, విముక్తి చేసేందుకు బీజేపీ పోరాడుతుందని చెప్పారు. 111 జీవో పరిధిలోనే కేసీఆర్‌కు, ఆయన కొడుకు, కూతురుకు సామ్రాజ్యాలున్నాయని ఆరోపించారు.

బీజేపీ ఏ మతానికీ, వర్గానికీ వ్యతిరేకం కాదని, కానీ హిందూ మతాన్ని కించపరిస్తే మాత్రం ఊరుకోదన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్‌ మాట్లాడుతూ.. ఒవైసీ సోదరులపై మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఎంఐఎం నేతలను పాకిస్తాన్‌ పంపిస్తామని అన్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల కాళ్లు పట్టుకోవటం ఎంఐఎంకు అలవాటైందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్, కర్ణాటక ఎంపీ, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇన్‌చార్జి మునుస్వామి, ఎస్సీ మోర్చా జాతీయ ఇన్‌చార్జి లాల్‌ సింగ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.మనోహర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

కాలికి గాయం: ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా రాత్రి లంగర్‌ హౌస్‌ వద్ద బండి సంజయ్‌ను కలిసేందుకు కార్యకర్తలు పోటీపడటంతో తోపులాట జరిగింది. ఈక్రమంలో ఆయన కిందపడిపోవడంతో కాలికి గాయమైంది. కాలికి కట్టుకట్టుకుని సోమవారం బాపూఘాట్‌ నుంచి యాత్రను కొనసాగించారు. టిప్పుఖాన్‌ బ్రిడ్జ్‌ మీదుగా.. ఆరె మైసమ్మ, అప్పా జంక్షన్, అజీజ్‌ నగర్‌ క్రాస్‌రోడ్డు మీదుగా హిమాయత్‌ సాగర్‌కు చేరుకున్నారు. యాత్ర రాజేందర్‌నగర్‌ నియోజకవర్గంలోకి చేరుకోగా మైలార్‌దేవరపల్లి కార్పొరేటర్‌ తోకల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గుర్రాలు, ఒంటెలతో ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా బోనాలు, మంగళహారతులతో నీరాజనం పలికారు.

‘డబుల్‌’ ఇళ్ల లెక్క చెప్పండి: బండి
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఎన్ని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కడతామన్నారు.. ఎన్ని పూర్తి చేశారు.. లబ్ధిదారుల జాబితాతో సహా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. తాను పాల్గొన్న పట్టణాభివృద్ధి కమిటీ భేటీలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి వెల్లడించిన వివరాల ప్రకారం.. 8,000 ఇళ్లు మాత్రమే కట్టినట్లు స్పష్టమౌతోందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) పథకం పేరును టీఆర్‌ఎస్‌ సర్కార్‌ మార్చేసిందని, కేంద్రం ఇచ్చిన నిధులతోనే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కడుతున్నారని చెప్పారు.

ప్రధాని మోదీకి మంచి పేరు వస్తుందనే పథకం పేరును మార్చేశారన్నారు. సోమవారం మూడో రోజు ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించి, హైదరాబాద్‌ బాపూఘాట్‌ సమీపంలో సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టర్ల కమీషన్‌ కోసమే డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కడుతున్నారని, వాటి నాణ్యతను ఇప్పటివరకు సీఎం కేసీఆర్‌ పరిశీలించలేదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు 2 లక్షలకు పైగా, జీహెచ్‌ఎంసీలో 1.40 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని ఈ ఇళ్లు ఎక్కడ కట్టారో చెప్పాలని ప్రశ్నించారు. వీటి నిర్మాణానికి కేంద్రం ఇప్పటివరకు రూ.3,500 కోట్లు విడుదల చేయగా, కేసీఆర్‌ సర్కార్‌ రూ.2,285 కోట్లు ఉపయోగించుకుందని చెప్పారు. ఇవిగాక జీహెచ్‌ఎంసీలో వివిధ పథకాల అమలుకు మోదీ ప్రభుత్వం రూ.1,287 కోట్లు మంజూరు చేసిందని సంజయ్‌ వివరించారు.  

ఆయుష్మాన్‌ భారత్‌ అమలేదీ.. 
హైదరాబాద్‌ శివారు భోజగుట్టలో టీఆర్‌ఎస్, ఎంఐఎం నేతలు ఆక్రమించుకున్న 40 ఎకరాల స్థలంతో పాటు ఇతర చోట్ల పీఎంఏవై కింద ఇళ్లు కట్టించి ఇవ్వాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ ఎందుకు అమలు  చేయడంలేదని ప్రశ్నించారు. కోవిడ్‌ కష్టకాలంలో ఆయుష్మాన్‌ భారత్‌ అమలు చేసి ఉంటే వైద్యచికిత్స ఖర్చుల నుంచి పేదలకు ఉపశమనం లభించి ఉండేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక టీఆర్‌ఎస్‌ నాయకులు మోకాళ్ల యాత్ర చేయకతప్పదని బండి హెచ్చరించారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు