టీఆర్‌ఎస్‌ పతనం..బీజేపీకి అధికారం తథ్యం

24 May, 2022 01:43 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న తరుణ్‌ఛుగ్‌. చిత్రంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌

పదాధికారుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌ 

రాష్ట్ర సర్కారు పెట్రో పన్నులు తగ్గించేలా నిరసనలకు పిలుపు

సాక్షి, హైదరాబాద్‌: ‘2023లో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కూలడం, బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం’అని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌ వ్యాఖ్యానించారు. ఇది తన మాట మాత్రమే కాదని, రాష్ట్ర ప్రజలందరిదని చెప్పారు. సోమవారం ఇక్కడ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అధ్యక్షతన పదాధికారుల సమావేశం జరిగింది. ౖటీఆర్‌ఎస్‌ నేతలు, పోలీసుల వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయిగణేశ్, ఇటీవల మృతిచెందిన మాజీ ఎంపీ జంగారెడ్డి, ఆసిఫాబాద్‌ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు జేపీ పౌడేల్‌ తదితరులకు సమావేశంలో సంతాపం తెలిపారు. అనంతరం తరుణ్‌ ఛుగ్‌ మాట్లాడుతూ ‘దేశం ఫస్ట్‌.. పార్టీ నెక్స్‌›్ట.. ఫ్యామిలీ లాస్ట్‌’అన్నదే బీజేపీ నినాదం.

సంజయ్‌ చేపట్టిన పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా రైతులొచ్చి కేసీఆర్‌ ప్రభుత్వం వల్ల పడుతున్న గోస చెప్పుకున్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌కు వ్యతిరేక వాతావరణం నెలకొంది. మీరంతా ఇదే విషయాన్ని ఇంటింటికీ వెళ్లి›ప్రచారం చేయాలి’అని సూచించారు. మోదీ సుపరిపాలనపై ఈ నెల 30 నుంచి జూన్‌ 14 దాకా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ‘రూ.4 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేయడమే గుణాత్మక మార్పా’అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి సాయం చేస్తున్న కేసీఆర్‌.. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగుల కుటుంబాలకు ఎందుకు సాయం చేయలేదని నిలదీశారు. దేశవ్యాప్తంగా మరో వెయ్యిమంది కేసీఆర్‌లు వచ్చినా బీజేపీని ఏమీ చేయలేరని ఎద్దేవా చేశారు.  

కేసీఆర్‌ తప్పుదోవ పట్టిస్తున్నారు: సంజయ్‌ 
తెలంగాణలో ఆత్మహత్యలే లేనట్లుగా దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా సీఎం కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని సంజయ్‌ ఆరోపించారు. ‘రాష్ట్ర సాధన కోసం ప్రాణాలొదిలిన 1,200 మంది అమరవీరుల కుటుంబాలకు ఇంతవరకు కేసీఆర్‌ పూర్తిగా సాయం అందించలేదు. ఇప్పుడేమో ఇతర రాష్ట్రాలకు సాయం పేరిట డ్రామా చేస్తున్నారు. కేసీఆర్‌కు చిత్తుశుద్ధి ఉంటే ఎన్ని అమరవీరుల కుటుంబాలకు ఆర్థికసాయం చేశారు.. ఎంతమందికి ఉద్యోగాలిచ్చారు.. ఎన్ని ఇళ్లు కట్టించారో చెప్పాలి. ఈ విషయాలు చెప్పకపోతే అమరవీరుల ఆత్మలు క్షోభిస్తాయి ’అని అన్నారు. సమావేశంలో పార్టీ జాతీయ సంఘటన సహాయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్, పార్టీ సీనియర్‌ నేతలు డాక్టర్‌ కె.లక్ష్మణ్, టి.రాజాసింగ్‌ తదితరులు పాల్గొన్నారు. 

జూన్‌ 23 నుంచి మూడోవిడత 
వచ్చే నెల 23 నుంచి జూలై 12 వరకు మూడో విడత, ఆగస్టులోగా నాలుగో విడత ప్రజాసంగ్రామయాత్రలను పూర్తిచేయాలని పదాధికారుల సమావేశంలో నిర్ణయించారు. మూడు, నాలుగో విడత పాదయాత్రలను ఎక్కడ ప్రారంభించి ఎక్కడ ముగిస్తారనే విషయాలను త్వరలో వెల్లడిస్తామని పాదయాత్ర ప్రముఖ్‌ డాక్టర్‌ గంగిడి మనోహర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.   

నాలుగు విభిన్న కోణాల్లో బీజేపీ కార్యాచరణ...
రాష్ట్రంలో నాలుగు విభిన్న కోణాల్లో.. అంటే, ఒకవైపు ప్రజాసంగ్రామయాత్ర–3, 4 సాగుతుండగానే, మిగతా ప్రాంతాల్లో, ఇతర నియోజకవర్గాల్లో రాజకీయపరమైన కార్యాచరణ, సామాజిక సమస్యలపై కార్యకలాపాలు, సంస్థాగత కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ పదాధికారుల సమావేశం నిర్ణయించింది. 1, 2 విడతల కంటే మరింత మెరుగ్గా మిగిలిన పాదయాత్రలు నిర్వహించేందుకు ఏమి చేయాలనే దానిపై వివిధ స్థాయిల పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు స్వీకరించాలని నిర్ణయించారు. కాగా, తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేదని, సరైన బాధ్యతలు అప్పగించడం లేదని పార్టీ జాతీయ సంఘటన సహ ప్రధానకార్యదర్శి శివప్రకాష్‌జీ వద్ద కొందరు నేతలు ప్రస్తావించినట్టు తెలుస్తోంది.   

మరిన్ని వార్తలు