కర్ణాటకలో కాంగ్రెస్ చేతిలో బీజేపీ చిత్తు.. ఈసారి 70 సీట్లే.. ఫేక్‌ సర్వే వైరల్‌

16 Mar, 2023 09:36 IST|Sakshi

బెంగళూరు: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో బీజేపీకి ఘోర పరాభవం తప్పదని ఆర్‌ఎస్‌ఎస్‌ సర్వేలో తేలిందని ఓ వార్త జోరుగా వ్యాప్తి చెందుతోంది. కమలం పార్టీ ఈసారి కేవలం 65-70 సీట్లకే పరిమితం అవుతుందని, కాంగ్రెస్‌  115-120 సీట్లు కైవసం చేసుకుని అధికారంలోకి వస్తుందని ఈ సర్వే పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆర్టికల్ కర్ణాటక దినపత్రిక కన్నడ ప్రభలో ప్రచురితమైందని, ఓ  ఫొటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహించిన అంతర్గత సర్వే అని విస్తృత ప్రచారం జరుగుతోంది.

అయితే ఇది గతంలో నిర్వహించిన పాత సర్వే అని తెలుస్తోంది. తన సొంత సామాజిక వర్గంలో బీఎస్‌ యడియూరప్ప పాపులారిటీ పడిపోయిందని ఈ సర్వేలో ఉంది. రెడ్డి సోదరులను బీజేపీలోకి తీసుకురావాలనే యడ్డీ నిర్ణయం బ్యాక్‌ఫైర్ అయిందని సర్వే పేర్కొంది.

దీంతో ఈ సర్వే ఇప్పటిది కాదని స్పష్టమవుతోంది. యడియూరప్ప ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. మరోవైపు కన్నడ ప్రభ కూడా ఈ వార్త తాము ఇప్పుడు ప్రచురించలేదని అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆర్‌ఎస్‌ఎస్ అంతర్గత సర్వే పేరుతో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని తేలిపోయింది. ఈ సర్వేలో బీజేపీకి 65-70, కాంగ్రెస్‌కు 115-120, జేడీఎస్‌కు 29-34 సీట్లు వస్తాయని ఉంది.

కాంగ్రెస్‌ పనే..
ఈ ఫేక్ సర్వేపై బీజేపీ నేత, కర్ణాటక ఆరోగ్యమంత్రి డాక్టర్ సుధాకర్ తీవ్రంగా స్పందించారు. బీజేపీకి రాష్ట్రంలో ప్రజల నుంచి వస్తున్నమద్దతు చూసి కాంగ్రెసే ఓర్వలేక ఫేక్‌ న్యూస్ వ్యాప్తి చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఓటమి తథ్యం అని, దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలా చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కాగా.. కర్ణాటకలో ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో కాంగ్రెసే విజయం సాధిస్తుందని తేలింది. మొత్తం 224 స్థానాలకు గానూ ఆ పార్టీకి 39-42 శాతం ఓట్లతో 116-122 సీట్లు వస్తాయని ఈ సర్వే పేర్కొంది.  బీజేపీకి 33-36 శాతం ఓట్లతో 77-83 సీట్లు వస్తాయని చెప్పింది.
చదవండి: అధికార డీఎంకేలో భగ్గుమన్న వర్గపోరు.. మంత్రి కళ్లెదుటే ఎంపీ ఇళ్లు, కారు ధ్వంసం

మరిన్ని వార్తలు