జాదూగర్‌ కా జాదూ ఖతం: భారీ మెజార్టీ మాదే!

3 Dec, 2023 11:01 IST|Sakshi

రాజస్థాన్‌లో బీజేపీ విజయం దిశగా శరవేగంగా అడుగులు వేస్తోంది. కౌంటింగ్‌ ప్రారంభం నుంచీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న కమలం  పార్టీ దాదాపు 106  సీట్లలో  ఎక్కువ  ఓట్లను సాధిస్తోంది. అటు అధికార పార్టీ 2018 ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఆధిక్యంలో వెనుకబడి ఉంది. అధికారమార్పుకోసం రాజస్థాన్‌ ప్రజలు ఎదురు చూస్తున్నారని ప్రకటించిన బీజేపీ అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది.

ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ భారీ మెజారీటీతో గెలుస్తుంది. మాంత్రికుడి మాయాజాలం ముగిసింది . రాజస్థాన్ ప్రజలు వాస్తవికతపై ఓటు వేశారని కేంద్ర మంత్రి చెప్పారు.అంతేకాదు ఛత్తీస్‌గఢ్‌లో కూడా విజయం తమదేనని పేర్కొన్నారు. అటు రాజస్థాన్‌ రాజధాని నగరం జైపూర్‌లో  బీజేపీ శ్రేణులు సంబరాలు మొదలు పెట్టేశారు.

మరోవైపు ప్రస్తుత ట్రెండ్‌పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి సంతోషం  వ్యక్తం చేశారు. ఇపుడున్న  ఆధిక్యం తుదివరకూ కొనసాగుతుందన్నారు. 199  సీట్లలో 135 సీట్లు తమకు దక్కుతాయని ధీమి వ్యక్తం చేశారు. అంతేకాదు విజయం తమదేననీ,  ఇప్పటికే స్వీట్లను కూడా పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. తుది ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్‌ 78 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీఎస్‌పీ 3,  సీపీఎం 1, స్వతంత్ర అభ్యర్థులు 8 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

మరిన్ని వార్తలు