దుబ్బాకలో టీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ

10 Nov, 2020 15:38 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం నమోదైంది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. నరాలు తెగే ఉత్కంఠ నడమ సాగిన పోరులో చివరి నాలుగు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబర్చి టీఆర్‌ఎస్‌ కంచుకోటలో తొలిసారి కాషాయ జెండా ఎగరేసింది. 1079 ఓట్ల మెజార్టీతో సమీప టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతపై రఘునందన్‌ విజయం సాధించారు. టీ-20 మ్యాచ్‌లా సాగిన పోరులో మొదటి పది రౌండ్స్‌లో బీజేపీ పూర్తిస్థాయి ఆధిక్యం కనబర్చగా.. అనుహ్యంగా పుంజుకున్న టీఆర్‌ఎస్‌ 11 నుంచి 20 రౌండ్‌ వరకు ఆధిక్యంలోకి దూసుకొచ్చి బీజేపీకి సవాలు విసిరింది.

ఆధిక్యం నుంచి ఓటమికి..
ఓ సమయంలో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమనే రీతిలో ఆధిక్యం కనబర్చింది. అయితే పడిలేచిన కెరటంలా చివరి నాలుగు రౌండ్స్‌లో బీజేపీ లీడ్‌లోకి వచ్చి.. ఉత్కంఠకు తెరదించింది. 19వ రౌండ్‌ ముగిసే సరికి అధికార టీఆర్‌ఎస్‌ 450 ఓట్ల ఆధిక్యంలో ఉండటంతో దాదాపు విజయం ఖాయమనుకున్నారు. అయితే వరుసగా 20, 21, 22, 23 రౌండ్స్‌లో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చి.. సంచలన విజయాన్ని నమోదు చేసింది. 20 రౌండ్లు ముగిసే సరికి బీజేపీకి 241 ఓట్ల ఆధిక్యం,  21వ రౌండ్‌లో 428 ఓట్ల, 22వ రౌండ్‌లో 438 ఓట్ల ఆధిక్యంతో పాటు 23వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం లభించడంతో 1,079 ఓట్ల మెజార్టీతో రఘునందన్‌ విజయం సాధించారు. దుబ్బాకలో మొత్తం 1,62,516 ఓట్లు పోలవ్వగా.. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు‌ 62,773  ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత 61,302 ఓట్లు తెచ్చుకుని గట్టిపోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌ రెడ్డి కేవలం 21,819 ఓట్లకే పరిమితం అయ్యారు. 

దుబ్బాక విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద బండి సంజయ్‌ కార్యకర్తలతో సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు దుబ్బాక ఫలితం టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ షాకింగ్‌కు గురిచేసింది. ప్రచారంలో మంత్రి హరీష్‌ రావు అన్నీ తానై వ్యవహరించినప్పటికీ.. ఓటర్లు రఘునందన్‌వైపే మొగ్గుచూపారు. లక్ష మెజార్టీ వస్తుందని హరీష్‌ అంచనా వేసినప్పటికీ.. బీజేపీ ధాటికి పరాజయం పాలవ్వక తప్పలేదు.

మరిన్ని వార్తలు