అస్సాంలో కాషాయ రెపరెపలు

3 May, 2021 04:41 IST|Sakshi
ప్రధాని మోదీతో సోనోవాల్, హిమంతా శర్మ

వరుసగా రెండోసారి విజయం సాధించిన కమలదళం

గువాహటి: ఎగ్జిట్‌పోల్స్‌అంచనాలను నిజంచేస్తూ అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ వరుసగా రెండోసారి విజయదుందుభి మోగించింది. 126 స్థానాలున్న అసెంబ్లీలో 74 సీట్లు గెలుచుకుంది. మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటేసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఎన్డీఏకు స్వల్పంగా సీట్లు తగ్గాయి. ఈసారి బీజేపీ 59 స్థానాల్లో విజయం సాధించగా, మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్‌ 9 చోట్ల, యునైటెడ్‌ పీపుల్స్‌ పార్టీ లిబరల్‌ 6 సీట్లలో గెలుపొందాయి.

ప్రముఖుల హవా...
సీఎం సర్బానంద సోనోవాల్, వైద్య మంత్రి హిమంతా బిశ్వాస్‌ శర్మ, ఏజీపీ చీఫ్, మంత్రి అతుల్‌ బోరా వరుసగా మజులీ, జాలుక్‌బరి, బోకాఖాట్‌ నియోజకవర్గాల నుంచి ఘన విజయం సాధించారు. తమ సుపరిపాలనకు మెచ్చే ప్రజలు మరోసారి పాలన సాగించాలని ఎన్డీఏకు అవకాశం ఇచ్చారని సోనోవాల్‌ వ్యాఖ్యానించారు. మంత్రి హిమంతా బిశ్వా శర్మ లక్ష ఓట్ల మెజారిటీ సాధించారు. ఆయనకు ఇది వరుసగా ఐదో గెలుపు. పటచార్‌కుచి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అస్సాం శాఖ అధ్యక్షుడు రంజీత్‌ దాస్‌... ఏజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పబీంద్ర దేకాపై గెలిచారు.

కాంగ్రెస్‌కు మళ్లీ తప్పని ఓటమి...
కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమి 51 సీట్లకే పరిమితమై మరోసారి అధికారానికి దూరమైంది. కాంగ్రెస్‌ 30 సీట్లను గెలుచుకోగా మహాకూటమిలోని మిగతా పార్టీలైన ఏఐయూడీఎఫ్‌ 16 సీట్లలో, బోడోల్యాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ 4 సీట్లలో, సీపీఎం ఒక చోట గెలిచాయి. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రిపుణ్‌ బోరా తన పదవికి రాజీనామా చేశారు. అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌ చేసిన పొరపాట్ల వల్లే భారీ మూల్యం చెల్లించుకుందని, ఎన్డీఏ గెలిచేందుకు ఇదే ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకుడు రాజన్‌ పాండే పేర్కొన్నారు. బీజేపీ సైతం అభ్యర్థుల తొలి జాబితా విడుదలలో పొరపాట్లు చేసినా ఆ తర్వాత విడుదల చేసిన జాబితాలలో ఆ తప్పుల ను సరిదిద్దుకుందన్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేస్తామనే హామీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లినా ఆశించిన స్థాయిలో ఓట్లు పొందలేకపోయిందన్నారు.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు