ఎంపీ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు.. త్వరలోనే ప్రకటన!

8 Feb, 2024 11:49 IST|Sakshi

కిషన్ రెడ్డి నివాసంలో అభ్యర్థుల ఎంపికపై చర్చించిన నేతలు

అభిప్రాయ సేకరణలో వచ్చిన వివిధ పేర్ల పై చర్చ

త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనున్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ

ఈ నెల 16 లోపే అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై భారతీయ జనతా పార్టీ  కసరత్తు చేపట్టింది. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి నివాసంలో పార్టీ కీలక నేతలు సమావేశమై చర్చించారు. అభిప్రాయ సేకరణలో వచ్చిన వివిధ పేర్లపై చర్చించినట్లు తెలుస్తోంది.  మొత్తం 17 స్థానాలకు గానూ మెజారిటీ స్థానాల్లో అభ్యర్థుల పేర్లు మొదటి జాబితా లోనే ఉండే అవకాశం ఉంది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఈనెల 16వ తేదీ లోపు ప్రకటించే అవకాశం ఉంది.

అభ్యర్థులు వీళ్లేనా..
తెలంగాణాలోని కీలక లోక్‌సభ స్థానాలకు ప్రధానంగా కొన్ని పేర్లను చర్చించినట్లుగా తెలుస్తోంది. వీటిలో సికింద్రాబాద్‌కు కిషన్ రెడ్డి, కరీంనగర్‌కు బండి సంజయ్, నిజామాబాద్‌కు ధర్మపురి అరవింద్, చేవెళ్లకు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరికి బూర నర్సయ్య గౌడ్, మహబూబ్‌నగర్‌కి  డీకే అరుణ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మల్కాజిగిరి టికెట్‌ను మురళీధర్ రావుతో పాటు ఈటెల రాజేందర్ కూడా ఆశిస్తున్నారు. కాగా మహబూబాబాద్ టికెట్ కోసం మాజీ ఎంపీ సీతారాం నాయక్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇక పెద్దపల్లి, మహబూబ్‌బాద్‌ లలో కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకొని టికెట్ ఇవ్వాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు నాగర్ కర్నూలు, వరంగల్, జహీరాబాద్, అదిలాబాద్ లలో బీఆర్‌ఎస్‌ నేతలపై కమలం పార్టీ కన్ను వేసినట్లుగా తెలుస్తోంది. మల్కాజ్‌గిరి, మెదక్, హైదరాబాద్ లలో ఎవరిని బరిలోకి దించాలని నిర్ణయం కేంద్ర ఎన్నికల కమిటీదే అని చెబుతున్నారు. ఖమ్మం, నల్గొండలలో కూడా బయటి నుంచి వచ్చిన వారికే అవకాశం ఇస్తారని భావిస్తున్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega