పోలీస్‌ అధికారిపై ‘ఖలిస్తానీ’ వ్యాఖ్యలు...చిక్కుల్లో బీజేపీ నేత

21 Feb, 2024 10:09 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ‘సందేశ్‌ఖాలీ’ వివాదం సద్దుమణగడం లేదు. నార్త్ 24 పరిగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీలో  టీఎంసీ నేతలు భూఆక్రమణలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గత వారం రోజులుగా రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ వ్యవహారంలో తాజాగా సిక్కు పోలీస్‌ అధికారిని ఖలిస్తానీ అంటూ దూషించడంతో రాష్ట్ర బీజేపీ నేత సువేందు అధికారి చిక్కుల్లో పడ్డారు.

ఈ వీడియోను పశ్చిమ బెంగాల్‌ పోలీసులు మంగళవారం షేర్‌ చేయడంతో తాజా వివాదం రాజుకుంది. ‘మా అధికారులలో ఒకరిని రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి 'ఖలిస్తానీ' అని పిలిచారు. అది తప్పు. అతను గర్వించదగిన సిక్కు, అలాగే చట్టాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న సమర్థుడైన పోలీసు అధికారి. ఈ వ్యాఖ్యలు మతపరంగా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఇది నేరపూరిత చర్య. ఒక వ్యక్తి మతపరమైన విశ్వాసాలను దెబ్బతీసేలా చేసిన ఈ వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం’ అని రాష్ట్ర పోలీసు అధికారిక హ్యాండిల్ నుంచి ట్వీట్‌ చేశారు.
చదవండి: సీనియర్‌ లాయర్‌ ఫాలీ నారీమన్‌ కన్నుమూత
 

సువేందు అధికారి వ్యాఖ్యలను సీఎం మమతా బెనర్జీ ఖండించారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. బీజేపీ నేతపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. పోలీసులు అధికార టీఎంసీకి లోబడి పనిచేస్తున్నారని మండిపడింది.

అయితే సువేందు అధికారి నేతృత్వంలో నిరసనకారులు సందేశ్‌ఖాలీని సందర్శించేందుకు వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఘర్షణలో, నిరసనకారులలో ఒకరు సంఘటన స్థలంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ పోలీసు అధికారిని ‘ఖలిస్తానీ’ అని పిలిచినట్లు తెలుస్తోంది. దీంతో కోపోద్రిక్తుడైన అధికారి ‘నేను తలపాగా వేసుకున్నాను, అందుకే నన్ను ఖలిస్తానీ అంటారా? దీనిపై నేను చర్య తీసుకుంటాను. మీరు నా మతంపై దాడి చేయలేరు. మీ మతం గురించి నేను ఏమీ చెప్పలేదు" అని అధికారి చెబుతున్నట్లు వీడియోలో  వినిపిస్తోంది.

whatsapp channel

మరిన్ని వార్తలు