బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి సిట్టింగ్‌ ఎమ్మెల్యే!

25 Sep, 2023 18:59 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పలు పార్టీల్లో సీనియర్‌ నేతలు కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. పరిస్థితి బట్టి అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీల్లోకి జంప్‌ అవుతున్నారు. తాజాగా మరో కీలక నేత బీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్టు వెల్లడించారు. ఆయన హస్తం గూటిలో చేరుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

టికెట్‌ ఇవ్వకపోవడంపై గుస్సా..
వివరాల ప్రకారం.. బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు బీఆర్‌ఎస్‌ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో పార్టీ నేతలతో బాపూరావు సమాలోచనలు, చర్చలు జరిపారు. తాను ఎమ్మెల్యేగా తప్పు చేయలేదని, పార్టీకి నష్టం చేయలేదని ఆయన అన్నారు. కొంతమంది చెప్పుడు మాటలు విని తనకు టికెట్‌ ఇవ్వలేదని ఆరోపించారు. మరో నాలుగు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా తాను ఏ పార్టీలో చేరుతున్న విషయం మాత్రం చెప్పలేదు. అయితే, బాపూరావు కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

కేటీఆర్‌ నో అపాంట్‌మెంట్‌..
మరోవైపు.. మూడు రోజుల క్రితం మంత్రి కేటీఆర్ అపాయింట్‌మెంట్ కావాలని కోరారు రాథోడ్ బాపురావు. దీనికి కేటీఆర్ స్పందించకపోవడంతో.. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఇక, బోథ్ నుంచి అనిల్ జాదవ్‌కు టికెట్ కేటాయించారు సీఎం కేసీఆర్. దీంతో  రాథోడ్ బాపురావు అసంతృప్తితో ఉన్నారు. పార్టీ మారాలంటూ ఆయన మద్దతుదారులు ఒత్తిడి తేవడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కాగా, మొదట పార్టీని వీడే అంశంపై రాథోడ్ బాపురావు విముఖత వ్యక్తం చేశారు. తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇదిలా ఉండగా.. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ వచ్చే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సిట్టింగ్‌లకు టికెట్‌ లభించకపోవడంతో వారు పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఇప్పటికే కొంత మంది బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌, బీజేపీలో చేరిపోయారు. 

ఇది కూడా చదవండి: కేసీఆర్‌ సర్కార్‌కు షాక్‌.. గవర్నర్‌ తమిళిసై సంచలన నిర్ణయం

మరిన్ని వార్తలు