సీఎం ప్రసంగం.. మంచి మెసేజ్‌లా ఉంది

13 Nov, 2022 04:22 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి బొత్స, పక్కన అమర్‌నాథ్, ఎంవీవీ సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి

రాష్ట్ర ప్రయోజనాలే సీఎంకు ముఖ్యం 

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్న జగన్‌ మాట ఘనం

అది మంచి నాయకత్వం, ఉత్తమ పరిపాలన విధానానికి నిదర్శనం 

భారీగా తరలివచ్చిన ఉత్తరాంధ్ర వాసులకు ధన్యవాదాలు 

రామోజీది కండ కావరం.. పవన్‌ది అజ్ఞానం 

రుషికొండపై ఈనాడులో విష ప్రచారం 

విశాఖ నగరం, ఉత్తరాంధ్రపై కక్ష, అక్కసు 

మీడియాతో మంత్రి బొత్స సత్యనారాయణ

సాక్షి, విశాఖపట్నం: తమకు రాజకీయాలు, పార్టీలు ముఖ్యం కాదని రాష్ట్ర శ్రేయస్సు మాత్రమే ముఖ్యమని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టంచేసిన తీరు మంచి నాయకత్వం, ఉత్తమ పరిపాలన విధానమని.. అలాగే, సీఎం ప్రసంగం రాబోయే తరాలకు మంచి మెసేజ్‌ ఇచ్చినట్లుగా ఉందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కొనియాడారు.

ప్రభుత్వ విధానాన్ని, పెండింగ్‌ సమస్యలను ఆయన స్పష్టంగా.. క్లుప్తంగా వివరించి వాటన్నింటినీ పరిష్కరించాలని ప్రధానిని కోరారన్నారు. తాను ఎందరో సీఎంల వద్ద పనిచేసినప్పటికీ ఈ రోజు ముఖ్యమంత్రి ప్రసంగం తీరుచూశాక జగన్‌పట్ల ప్రత్యేక స్థానం ఏర్పడిందన్నారు.

మద్దిలపాలెంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో కలిసి బొత్స మీడియాతో మాట్లాడారు. విశాఖలో ప్రధాని బహిరంగ సభకు తరలివచ్చిన లక్షలాది మంది ఉత్తరాంధ్ర వాసులందరికీ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

పవన్‌ది అజ్ఞానం.. రామోజీ కండ కావరం 
నిన్న ఇక్కడికి ఒక సెలబ్రిటీ వచ్చి.. తనను ప్రధాని కలవమన్నారని చెప్పారు. ప్రధానిని కలిసొచ్చిన తర్వాత మీడియాతో.. తాను ప్రభుత్వంపై ఫిర్యాదు చేశానని వెల్లడించారు. అంతేకానీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవి అడిగానని చెప్పలేదు. అలా చెప్పిఉంటే ఎంతో హుందాగా ఉండేది. కానీ, పవన్‌ ఒక అజ్ఞానిలా ప్రవర్తించాడు.

ఇక వారికి వత్తాసు పలికే ఈనాడు పత్రిక ‘కొండ కావరం’ అని రుషికొండపై మరీ దిగజారి వార్త రాసింది. అది నిజానికి రామోజీరావుకు, ఈ పత్రికకు ఉన్న కండ కావరం. ఉత్తరాంధ్ర భాషలో దానిని ఒళ్లు బలుపు అంటారు. రాష్ట్ర ప్రభుత్వం మీద, ఉత్తరాంధ్రపైనా ఎంత అక్కసు, కక్ష ఉందో ఈ వార్త ద్వారా అర్థమవుతోంది. 

రుషికొండపై నిర్మాణాల్లో తప్పేమిటి? 
రుషికొండపై ఎందుకు వారు తప్పుడు కథనాలు రాస్తున్నారు? రుషికొండ మీద ప్రభుత్వం కొన్ని భవనాలు కడుతోంది. అందులో తప్పేముంది? రుషికొండ మీద గతంలోనే గెస్ట్‌హౌస్‌ ఉంది. 

శిథిలమైన దాన్ని తొలగించి ఇప్పుడు కొత్త భవనాలు కడుతుంటే ఏమిటి తప్పు? ప్రభుత్వం ఏమైనా రామోజీ ఫిల్మ్‌సిటీ మాదిరిగా వేల ఎకరాల్లో భవనాలు కడుతోందా? సుమారు రూ.11 వేల కోట్ల పనులకు సంబంధించి శంకుస్థాపనలు జరిగాయి. ఇంకా అభివృద్ధి పనులు జరగాలని ఆలోచించాలే తప్ప ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయడమేమిటి?

రాష్ట్ర ప్రయోజనాలే సీఎంకు ముఖ్యం 
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని సీఎం జగన్‌ చెబుతుంటారు.. అందుకు తగ్గట్లే ఆయన వ్యవహరిస్తున్నారు. సీఎంకి రాష్ట్ర ప్రయోజనాలు చాలా ముఖ్యం. ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ధిని కూడా కాంక్షిస్తున్నారు. అభిమానం ఉండబట్టే విశాఖ సభకు లక్షలాది మంది తరలివచ్చారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు, పచ్చ మీడియా వాస్తవాలు గుర్తించి ప్రజల ఆకాంక్షను గౌరవించాలి. 

జగనన్న లేఅవుట్‌ చూస్తాడట.. చూడనివ్వండి
పవన్‌కళ్యాణ్‌ ఆదివారం మా జిల్లా విజయనగరానికి వెళ్తాడట. జగనన్న లేఅవుట్‌ కాలనీ చూస్తాడట. చూడనివ్వండి. ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద లేఅవుట్‌ అది. సుమారు 400 ఎకరాల్లో 12 వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. వారిలో 10 వేల మందికి ఇళ్లు కూడా మంజూరు చేశాం. పనులు సాగుతున్నాయి. అది కాలనీ కాదు. ఒక ఊరు అని చెప్పాలి. 10 వేల ఇళ్లు అంటే దాదాపు 40 వేల జనాభా. అంటే ఒక పట్టణంలా ఉంటుంది. మా ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే. రాష్ట్రంలో సొంత ఇల్లులేని ఒక్క నిరుపేద కూడా ఉండకూడదు. కాలనీల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నాం. 

మరిన్ని వార్తలు