చంద్రబాబు అమరావతి పోరాటం ఓ ఫ్లాప్‌ షో

12 Oct, 2020 04:14 IST|Sakshi

రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 

టీడీపీ పిలుపునకు ఏ ప్రాంతంలోనూ స్పందనలేదు 

సాక్షి, విశాఖపట్నం: అమరావతి ఉద్యమం పేరుతో చంద్రబాబు, టీడీపీ నాయకులు, కొంతమంది పెయిడ్‌ ఆర్టిస్టులను పెట్టుకుని చేస్తున్న నిరసనలు చూస్తుంటే.. ఫ్లాప్‌ అయిన సినిమాకు వందరోజుల ఫంక్షన్‌ చేస్తున్నట్లుందని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన విశాఖలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వాళ్ల దోపిడీ ప్రజలకు పూర్తిగా తెలుసు కాబట్టి చంద్రబాబు, టీడీపీ పిలుపునకు ఏ ప్రాంతంలో కూడా ప్రజలు స్పందించలేదన్నారు. అమరావతిలో అసలు ఉద్యమమే లేదన్నారు.

చిన్న రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చంద్రబాబు చెబుతున్నది అబద్ధమన్నారు. ఒకవేళ అదే నిజమనుకుంటే, బినామీల పేరుతో 2 వేల ఎకరాలకు పైగా భూములు కొన్న చంద్రబాబు గుండె నిబ్బరంతో ఎలా ఉండగలిగారు అని ప్రశ్నించారు. విశాఖలో జరిగిన ల్యాండ్‌ స్కాంలపై సిట్‌ విచారణ జరుగుతోందని, దోషులపై చర్యలు తప్పవని చెప్పారు. చంద్రబాబును ఏపీ టూరిస్టుగా పిలిస్తే బాగుంటుందని, ఆయన జూమ్‌ మీటింగ్‌లో మాట్లాడుకుంటూ, జూమ్‌ పార్టీ నడుపుకుంటే మంచిదని విమర్శించారు. 

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి ఓ ఏజెన్సీకి 2,500 ఎకరాలు గత ప్రభుత్వం అప్పగించాలని చూసిందని, అందులో 500 ఎకరాలు తగ్గించి, ఆ భూముల్లో ఎస్‌ఈజెడ్‌ ఏర్పాటుచేసి, ఉపాధి అవకాశాలు పెంచాలని ఈ ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు.   

మరిన్ని వార్తలు