ఎన్‌సీసీ భూముల వ్యవహారంలో బాబే సూత్రధారి 

8 Apr, 2022 03:51 IST|Sakshi

కేబినెట్‌ నిర్ణయానికి విరుద్ధంగా సంస్థకు జీపీఏ చేశారు.. ప్రభుత్వ ఖజానాకు రూ.100 కోట్ల నష్టాన్ని కలిగించారు..

అధికారం లేకపోయినా ఇష్టానుసారంగా జీవోలిచ్చారు.. వైఎస్సార్‌సీపీ పభుత్వం ఆ అడ్డగోలు జీవోలను రద్దు చేసింది

వాల్యుయర్స్‌ నిర్ణయించిన విలువ చెల్లించాలని స్పష్టంచేశాం

రిజిస్ట్రేషన్లకు కూడా డబ్బులు చెల్లించాల్సిందేనని ఉత్తర్వులిచ్చాం

ఇవేవీ తెలియనట్లుగా ‘ఈనాడు’ తప్పుడు కథనాలు రాస్తోంది

మంత్రి బొత్స మండిపాటు  

సాక్షి,విశాఖ దక్షిణ/అమరావతి: కేబినెట్‌ నిర్ణయానికి విరుద్ధంగా.. నిబంధనల్ని తుంగలో తొక్కి ఎన్‌సీసీ సంస్థకు లబ్ధి చేకూర్చింది చంద్రబాబు నాయుడేనని, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు లేకుండా జీపీఏ చేసి ప్రభుత్వ ఖజానాకు రూ.100 కోట్లు నష్టం వచ్చేలా చేసిన ఘనుడు ఆయనేనని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్‌సీసీ భూముల వ్యవహారంపై తెలుగుదేశం చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు చేసిన కుట్రకు అడ్టుకట్ట వేసి.. ఇద్దరు సభ్యుల కమిషన్‌ ఆ భూములకు నిర్ణయించిన విలువను, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను కూడా చెల్లించాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని గుర్తుచేశారు. అయినా దీనిపై టీడీపీ రాద్దాంతం చేస్తుండటాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ సందర్భంగా 2005లో ప్రభుత్వానికి, ఎన్‌సీసీ సంస్థకు మధ్య జరిగిన ఒప్పంద వ్యవహారాలను స్పష్టంగా వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 

2005లో నిబంధనలు ప్రకారమే..!  
మధురవాడలో ఉన్న 97.35 ఎకరాల భూమిని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) పద్దతిన అభివృద్ధి చేసేందుకు ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని 2005లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. నాటి ప్రభుత్వంలో నేనూ మంత్రినే. పారదర్శకంగా నిర్వహించిన టెండర్లలో ఆరు ప్రైవేటు సంస్థలు బిల్డింగ్‌లో పాల్గొనగా అందులో ఎన్‌సీసీ సంస్థ ఎల్‌1గా నిలిచి ఆ ప్రాజెక్టును దక్కించుకుంది. ప్రాజెక్టులో భాగంగా రూ.90 కోట్లు ప్రభుత్వానికి చెల్లించడంతో పాటు అభివృద్ధి చేసిన నిర్మాణాల్లో 16 శాతం వాటా ఇచ్చేందుకు ఎన్‌సీసీ సంస్థ ముందుకొచ్చి అంగీకరించింది. దీంతో 2005, అక్టోబర్‌ 31వ తేదీన ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎన్‌సీసీ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పంద సమయంలో సదరు సంస్థ ప్రభుత్వానికి రూ.90 కోట్లు చెల్లించింది.  

2013లోనే రద్దు చేయాలని నిర్ణయించి...! 
2005లో ఒప్పందం చేసుకున్నప్పటికీ ఎన్‌సీసీ సంస్థ ప్రాజెక్టును ప్రారంభించలేదు. 2009లో భూ వినియోగ మార్పిడి కోసం దరఖాస్తు చేసుకోగా.. జీవో నెంబర్‌ 177 ప్రకారం అనుమతులు మంజూరు చేశారు. ఆ తరవాత కూడా ఎన్‌సీసీ నిర్మాణాలు చేపట్టలేదు. ç2013లో అప్పటి ప్రభుత్వం ఎన్‌సీసీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించింది. ఈ రద్దు విషయాన్ని అడ్వకేట్‌ జనరల్‌ దృష్టికి తీసుకువెళ్లగా.. రద్దు చేయకుండా ఆర్బిట్రేషన్‌కు వెళ్లాలని ఏజీ సలహా ఇచ్చారు. అయితే దీనిపై ఎన్‌సీసీ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు స్టేటస్‌ కో ఉత్తర్వులు జారీ చేసింది. 

ఎన్‌సీసీకి కట్టబెట్టింది చంద్రబాబే 
2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంతో ఎన్‌సీసీ సంస్థ సంప్రతింపులు జరిపింది. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన 16 శాతం వాటాకు విలువ కట్టేందుకు ఇద్దరు సభ్యులతో కూడిన కమిషన్‌ను ఏర్పాటు చేశారు. వారు నిర్ణయించిన విలువను చెల్లించి ఎన్‌సీసీ సంస్థ ఆ స్థలాన్ని సొంతం చేసుకోవచ్చన్న అంశాన్ని కేబినెట్‌లో కూడా పెట్టి టీడీపీ ప్రభుత్వం ఆమోదించింది. దీనిపై అప్పట్లో 121 జీవోను కూడా విడుదల చేసింది. 2019 మార్చిలో ఎన్నికలకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్‌సీసీ సంస్థ పరస్పర అంగీకారానికి వచ్చాయి. 

కేబినెట్‌ నిర్ణయాన్ని కాదని చంద్రబాబు దగా.. 
కేబినెట్‌ నిర్ణయం ప్రకారం వాటా చెల్లించేందుకు ముందుకొచ్చిన ఎన్‌సీసీ... ఆ తరవాత మాత్రం రిజిస్ట్రేషన్, స్టాంప్‌ డ్యూటీలు పెరిగిపోతున్నాయని, ఇందుకోసం జీపీఏ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబుకు దరఖాస్తు చేసుకుంది. నిజానికి కేబినెట్‌ నిర్ణయానికి మార్పులు, చేర్పులు చేయలంటే మళ్లీ కేబినెట్‌ ఆమోదం ఉండాలనే నిబంధనను తుంగలో తొక్కి చంద్రబాబు ఇష్టానుసారంగా వ్యవహరించారు. 2019, మార్చి 10న ఎన్‌సీసీకి జీపీఏ ఇచ్చారు. ఆ ప్రాజెక్టు పూర్తయ్యాక వాటిని కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వమే రిజిస్ట్రేషన్‌ చేసేలా అక్రమంగా అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు లేకుండా బిజినెస్‌ రూల్స్‌కు వ్యతిరేకంగా వ్యవహరించి రూ.100 కోట్లు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా చంద్రబాబే ఎన్‌సీసీ సంస్థకు భూములు కట్టబెట్టారు.  

ప్రభుత్వ వాటాతో పాటు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు కట్టమన్నాం 
మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాం. దీనిపై ఏజీ సలహా కోరగా.. కేబినెట్‌ ఆమోదించిన నిర్ణయాన్ని మార్చే హక్కు ముఖ్యమంత్రికి లేదని తేల్చి చెప్పడంతో చంద్రబాబు ఇచ్చిన జీపీఏ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఏపీ హౌసింగ్‌ బోర్డుకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీనిపై ఎన్‌సీసీ సంస్థ ప్రభుత్వాన్ని సంప్రతించినప్పటికీ.. జీపీఏ చేయడం జరగదని, ఇద్దరు సభ్యులు నిర్ణయించిన విలువ ప్రకారం డబ్బులు చెల్లించడంతో పాటు రిజిస్ట్రేషన్‌ చార్జీలు కూడా చెల్లించాలని స్పష్టం చేశాం. అప్పట్లో చేసుకున్న జీపీఏ ఒప్పందాన్ని రద్దు చేస్తూ 67 జీవోను కూడా విడుదల చేశాం. ఇద్దరు సభ్యుల కమిషన్‌ నిర్ణయించిన విలువ ప్రకారం 16 శాతం వాటా కింద రూ.97.29 కోట్లతో పాటు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు చెల్లించాలని 2020, డిసెంబర్‌ 20న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం ఎన్‌సీసీ సంస్థ ఒప్పంద సమయంలో రూ.90 కోట్లు, ప్రస్తుత వాటా విలువ ప్రకారం రూ.97.29 కోట్లతో మొత్తంగా రూ.187.29 కోట్లు చెల్లించినట్లు అవుతుంది. దీనితో పాటు రిజిస్ట్రేషన్‌ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ అంశాన్ని కేబినెట్‌లో సైతం ఆమోదించాం. 

ఈనాడువి తప్పుడు కథనాలు! 
‘‘ప్రభుత్వ ఖజానాకు రూ.100 కోట్లు నష్టం చేసే విధంగా చంద్రబాబు ప్రయత్నిస్తే.. దానికి అడ్డుకట్ట వేసి ప్రస్తుత భూ విలువతో పాటు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు చెల్లించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే తప్పేముంది? చంద్రబాబు చేసిన కుట్రను ఈనాడు పత్రిక కూడా గమనించకుండా ఈ భూముల వ్యవహారంపై పేజీలకు పేజీలకు తప్పుడు కథనాలు రాస్తోంది. ఎన్‌సీసీకి అనుకూలంగా వ్యవహరించింది తెలుగుదేశం ప్రభుత్వమే. చంద్రబాబు దగాను తెలుసుకోలేక స్థానిక తెలుగుదేశం నాయకులు అమాయకంగా ధర్నాలు చేస్తున్నారు’’. అంటూ మంత్రి బొత్స మండిపడ్డారు.  

మరిన్ని వార్తలు