టీడీపీ పాలనలో బీసీలంటే బాబు క్లాస్‌

25 Dec, 2022 05:15 IST|Sakshi

బలహీనవర్గాల అభ్యున్నతికి బాటలు వేసింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే    

చంద్రబాబు చేసిన ఒక్క మంచి పని చూపించండి 

మంత్రులపై ఎవరో పెత్తనం చేయడానికి మేము అమాయకులమా? 

మంత్రి బొత్స సత్యనారాయణ 

సాక్షి ప్రతినిధి, విజయనగరం: బీసీలను ఉద్ధరించినట్టు చంద్రబాబు డబ్బా కొట్టుకుంటున్నారని, ఆయన పాలనలో బీసీలంటే బలహీనవర్గాలు కాదని, బాబు క్లాస్‌ వారు మాత్రమేనని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. అప్పట్లో బాబు సిట్‌ అంటే సిట్, స్టాండ్‌ అంటే స్టాండ్‌ అని గుర్తు చేశారు. బలహీనవర్గాల అభ్యున్నతికి బాటలు వేసింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని చెప్పారు.

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఏం చేస్తే వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయో వాటినే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్నారని చెప్పారు. విజయనగరంలో చంద్రబాబు పొల్లు, సొల్లు కబుర్లు మాత్రమే చెప్పారన్నారు. బొత్స శనివారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సైకోలంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ చంద్రబాబు రోజురోజుకూ దిగజారిపోతున్నారని అన్నారు.

టీడీపీకి నూకలు చెల్లిపోయాయని, భవిష్యత్తు లేదని చెప్పారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, ఈటీవీ, ఏబీఎన్‌ చానళ్లు రోజంతా సినిమా చూపించినా చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఆయన పాలనలో చక్రం తిప్పింది చుట్టాలు, పట్టాలు మాత్రమేనన్నారు. అమరావతిలో 30 వేల ఎకరాలు దోచుకున్నారని చెప్పారు. చంద్రబాబు కళ్లకు అంతా పచ్చగా కనిపిస్తోందని, వారిలాగే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో దోచుకుంటున్నారంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

టీడీపీ పాలనలో కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు ఎలా మంత్రులుగా ఉన్నారో తామూ అలాగే మంత్రులమని చెప్పారు. తమ మీద ఎవరో పెత్తనం చేయడానికి అమాయకులమా అని అన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేక ఇప్పుడు వ్యక్తిగత దూషణలు, ఊకదంపుడు ప్రసంగాలనే నమ్ముకుంటున్నారన్నారు. కనీసం విజయనగరం జిల్లాకు ఏదైనా చేసుంటే అదైనా చెప్పుకోవచ్చు కదా అని అన్నారు.

ఆయన చేసిన ఒక్క మంచి పని చూపించమనండి అంటూ సవాలు విసిరారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ఏం చేసిందో క్షేత్రస్థాయిలోకి వస్తే చూపిస్తామన్నారు. డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య కూడా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు