పేదలకు ఒక్క ఇల్లయినా ఇచ్చావా బాబూ..

8 Mar, 2021 03:40 IST|Sakshi

హుద్‌హుద్‌లో భూరికార్డులు ఎందుకు తారుమారయ్యాయి? 

విశాఖ భూగర్భ డ్రైనేజీపై మాట్లాడటం విడ్డూరం: మంత్రి బొత్స 

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పేదల ఆశలపై నీళ్లు చల్లింది టీడీపీనేనని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖలో ఆదివారం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌ హయాంలోనే విశాఖ అభివృద్ధి చెందిందని చెప్పారు. ‘చంద్రబాబు తన పాలనలో విశాఖకు ఎన్నెన్నో చేశానని చెబుతున్నారు. హుద్‌హుద్‌ సమయంలో ఇక్కడే కూర్చొని అన్నీ బాగుచేశానంటున్నారు. ఆనందపురం, పెందుర్తి, భీమిలి, పరవాడ తహసీల్దార్‌ కార్యాలయాల్లో హుద్‌హుద్‌ తర్వాత భూ రికార్డులు ఎలా మారిపోయాయి?’ అని ప్రశ్నించారు.

ఎన్ని గుండెలు ఉన్నాయి బాబూ..: చంద్రబాబు ఎక్కడికి వెళితే ఆ ప్రాంతమే తన గుండెల్లో ఉందంటాడని, అమరావతి, హైదరాబాద్, విశాఖలో అవే అబద్ధాలు చెబుతున్నాడని, ఇంతకీ చంద్రబాబుకి ఎన్ని గుండెలున్నాయో అర్థంకాలేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడడం చంద్రబాబుకి తగదని, 14 ఏళ్లపాటు సీఎంగా చేసిన సంస్కారం ఇదేనా అని మండిపడ్డారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఒక్క ఇల్లు అయినా పేదలకు ఇచ్చారా? అని ప్రశ్నించారు. విశాఖ భూగర్భ డ్రైనేజీ గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. దాదాపు రూ.900 కోట్ల వ్యయంతో మురుగునీటిని శుభ్రం చేసి పరిశ్రమలకు ఇచ్చే ప్రాజెక్టు తెచ్చారని చెప్పారు.

దాన్లో రూ.450 కోట్లు అప్పు, మరో రూ.50 కోట్లు బాండ్ల రూపంలో సేకరించారన్నారు. దానికి జీవీఎంసీ బిల్డింగ్‌లను తాకట్టు పెట్టారు తప్ప గ్యారెంటీ ఇవ్వలేదన్నారు. అందుకే దాన్ని రీస్ట్రక్చర్‌ చేసి రుణం తగ్గించి, తమ ప్రభుత్వం రూ.200 కోట్లు ఇచ్చి పనులు చేపడుతోందని.. ప్రభుత్వ బాధ్యతంటే అది.. అని చెప్పారు. తాము పన్నులు పెంచబోతున్నామని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని, నిజానికి చంద్రబాబు హయాంలో 33 శాతం నీటిపన్ను పెంచారని గుర్తు చేశారు. ప్రస్తుత పన్నుపై 15 శాతానికి మించి పెంచొద్దని చట్టం కూడా చేశామన్నారు. 

మరిన్ని వార్తలు