రాజకీయ లబ్ధి కోసమే బాబు కుయుక్తులు

27 Apr, 2021 05:27 IST|Sakshi

కరోనాపై యుద్ధంలో ఉద్యోగులు సైనికుల్లా పోరాడుతున్నారు

బాబు జీర్ణించుకోలేకపోతున్నారు

ఆక్సిజన్‌ కొరత ఉందని, వైద్యం అందడం లేదని దుష్ప్రచారం

ఎల్లో మీడియావి అసత్య కథనాలు

పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజం

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తుంటే.. టీడీపీ రాజకీయ లబ్ధి కోసం అనవసర రాజకీయం చేస్తోందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. వైద్యం అందడం లేదని, ఆక్సిజన్‌ కొరత ఉందంటూ ప్రజల్లో ఆందోళన కలిగించేలా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఉద్యోగులు సైనికుల్లా కరోనాపై పోరాడుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో బాధ్యత గల ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వ్యవహరించాలని హితవు పలికారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం మీడియాతో మాట్లాడారు. అత్యధికంగా కోవిడ్‌ పరీక్షలు చేయడం, 50 వేలకు పైగా పడకలు సిద్ధం చేయడం, కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. దీంతో నిద్రపట్టని చంద్రబాబు, లోకేష్‌ ఉద్యోగులు, కార్మికులు, రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలొస్తే టీడీపీ బతికుండదని తెలిసి రాష్ట్రంలో అగ్గి రాజేçస్తున్నారని విమర్శించారు. గతంలో విశాఖ స్టీల్, పోలవరం అంశాల్లోనూ ఇలాగే చేశారని గుర్తుచేశారు. మంత్రి బొత్స ఇంకేమన్నారంటే... 

అరాచకశక్తుల్లా చంద్రబాబు, లోకేష్‌ 
చంద్రబాబు, లోకేష్‌ అరాచక శక్తుల్లా, ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నారు. వీళ్లకు కార్మికులు, ఉద్యోగులు, రైతుల మీద ఏమాత్రం ప్రేమ లేదు. టీడీపీ, దాని ఎల్లో మీడియా ప్రజల కోసం కష్టపడుతున్న ప్రభుత్వాన్ని, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లను ఏమాత్రం గౌరవించడం లేదు. ఇలాంటి విపత్తులో సర్కార్‌కు మద్దతుగా నిలుస్తారా? గుంట నక్కల పాత్ర పోషిస్తారా? గతంలో ప్రకృతి వైపరీత్యాలొస్తే.. పత్రికలు, టీవీలు సహాయనిధి పోగేసేవి. ఇప్పుడేమైంది? మేం సహాయనిధి కోరుకోవడం లేదు. ప్రభుత్వం చేసే మంచిని కాస్తయినా మెచ్చుకుంటే చాలనుకుంటున్నాం. కనీసం ఇది కూడా చేయకుండా.. లేనిపోని అపార్థాల్ని, అపోహల్ని పెంచుతున్నారు. మనందరం కరోనాపై పోరాడాల్సిన సమయమిది. అది మరిచిపోయి కులం, వర్గం పేరుతో నీచ రాజకీయాలు చేయడానికి ఇదా సమయం? బాధ్యత గల ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారా? ఆయన అనుకూల మీడియా ఏవిధంగా వ్యవహరిస్తుందో ఆత్మపరిశీలన చేసుకోవాలి. చేసిన దుష్ప్రచారానికి సిగ్గుపడాలి.

లోకేష్‌కు ఇంగితజ్ఞానం ఉందా?
లోకేష్‌ ఇంటర్‌ పరీక్ష రాస్తే పాసవుతారో, లేదో.. పదో తరగతి ప్రశ్నపత్రం రాయగలరో? లేదో?.. అనుమానమే. ఆయన మాత్రం కాలేజీ విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్‌కు కనీస ఇంగితజ్ఞానం ఉందా? పరీక్షలు, విద్యార్థుల గురించి ఆయనలాంటి గాలి బ్యాచ్‌ నాయకుడు మాట్లాడితే నమ్ముతారా? ఆయన చెప్పినట్టు పరీక్షలు రద్దు చేస్తే విద్యార్థులకు నష్టం. లోకేష్‌ డిమాండ్‌ సరైందే అయితే కేంద్ర ప్రభుత్వమే పరీక్షలు రద్దు చేసి ఉండాలి కదా! బాధ్యత గల ప్రభుత్వం కాబట్టే విద్యార్థుల గురించి ఆలోచిస్తోంది. సమాజాన్ని ముక్కలు చేయడానికే చంద్రబాబు, లోకేష్, ఎల్లో మీడియా పనిచేస్తున్నాయి. 

మరిన్ని వార్తలు