రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం

11 Jan, 2021 03:58 IST|Sakshi

స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై మంత్రి బొత్స

అధికార అహంకారంతోనే నిమ్మగడ్డ మొండివైఖరి

చంద్రబాబు కనుసన్నల్లో ఎన్నికల కమిషనర్‌ పనిచేస్తున్నారు

పట్టాల పంపిణీని ఓర్వలేని బాబు మాటలు విని ఈ నిర్ణయం తీసుకున్నారు

ప్రజల ప్రాణాలతో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు 

సాక్షి, విశాఖపట్నం: అధికార అహంకారంతోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మొండిగా వ్యవహరిస్తున్నారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మొండి వైఖరితో ఏకపక్షంగా స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ జారీ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమన్నారు. ఆదివారం విశాఖ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డిపాజిట్లు కూడా రాని రాజకీయ పార్టీలు స్వాగతిస్తే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించేస్తారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కనుసన్నల్లోనే ఎన్నికల కమిషనర్‌ పనిచేస్తున్నారన్నారు. కరోనా కేసులు తక్కువగా ఉన్నప్పుడు, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఎన్నికలు నిలిపివేశామని చెప్పిన నిమ్మగడ్డ... వేలాది కరోనా కేసులున్నప్పుడు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. అప్పట్లో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసి నామినేషన్లు ముగిసి పోలింగ్‌కు సిద్ధమైన సమయంలో.. కరోనా పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేయడం తగదని తాను, మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినా రమేష్‌కుమార్‌ వినలేదన్నారు.

ఇప్పుడు ప్రజల ప్రాణాలతో సంబంధం లేకుండా, న్యాయస్థానాలను పట్టించుకోకుండా.. చంద్రబాబు స్వార్థపూరిత ప్రయోజనాలను కాపాడడానికే ఎన్నికల కమిషన్‌ పనిచేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. ‘హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ముగ్గురు ఉన్నత స్థాయి అధికారుల బృందం 8వ తేదీ సాయంత్రం ఎన్నికల కమిషనర్‌ను కలసిందంటూ.. వారు కలసి వచ్చిన కొద్ది గంటలకే ఎన్నికల కమిషనర్‌ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారని బొత్స మండిపడ్డారు. ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ ముందే ఓ నిర్ణయానికి వచ్చారని, ప్రజా ప్రభుత్వ నిర్ణయాన్ని పట్టించుకోకుండా.. రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న ఉచిత పట్టాల పంపిణీని చూసి ఓర్వలేని చంద్రబాబు మాటలు విని ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. గత నెల 25  నుంచి రాష్ట్రంలో సుమారుగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి సీఎం వైఎస్‌ జగన్‌ చరిత్ర పుటల్లో నిలిచిపోయారన్నారు. 

ప్రజలు, ఉద్యోగుల సంక్షేమమే మాకు ముఖ్యం
తమ ప్రభుత్వానికి ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలు, సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే ముఖ్యమని బొత్స స్పష్టం చేశారు. ఎన్నికల్లో పాల్గొనలేమని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయని గుర్తుచేశారు.  కోవిడ్‌ రూపాంతరం చెంది ప్రమాదకరంగా మారుతున్న సమయంలో ఎన్నికలతో ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందన్నారు.   

మరిన్ని వార్తలు