లోకేశ్‌వి అవగాహన లేని మాటలు 

24 Aug, 2021 04:19 IST|Sakshi

అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం 

రాజధాని విశాఖ వెళ్లడం తథ్యం 

టిడ్కో ఇళ్ల పంపిణీకి రేపట్నుంచి ఏర్పాట్లు 

పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 

సాక్షి, అమరావతి: టిడ్కో ఇళ్ల గురించి, బీసీ వర్గాలకు ప్రభుత్వం అందించే పథకాల గురించి లోకేశ్‌ అవగాహనలేని మాటలు మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వారు ఏం చేశారు, ఎలా చేశారు, ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ సర్కారు ఏమేమి ఇస్తుందన్న విషయం పోల్చిచెబితే బాగుండేదన్నారు. చేయూత, నేతన్న నేస్తం వంటి ఎన్నో పథకాల వల్ల బీసీలకు న్యాయం జరుగుతోందన్నారు. వారి జీవన విధానం మారడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని తెలిపారు. వారి ఆర్థిక, జీవనస్థితి మారేలా కృషిచేస్తున్నామన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్‌ వద్ద సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. చదవండి: తుపాను ముందు.. ప్రశాంతత!

రాజధాని కేసుపై రోజువారీ విచారణ అన్నప్పుడు పిటిషనర్లే వాయిదా అడగాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాల మేరకే తాము పనిచేస్తామన్నారు. ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు. విశాఖకు రాజధాని వెళ్లకపోవడమంటూ ఉండదన్నారు. న్యాయస్థానాన్ని ఒప్పిస్తామని, న్యాయస్థానం ఆదేశాలతోనే వెళతామని చెప్పారు. జగనన్నకాలనీల నిర్మాణం, టిడ్కో ఇళ్ల కేటాయింపులపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షించారని, పనులు వేగంగా చేయాలని అధికారులను ఆదేశించారని తెలిపారు.

దేశంలోని అన్ని నగరాల్లో స్వచ్ఛ్‌ భారత్‌ కింద వ్యర్థాల మేనేజ్‌మెంట్‌లో సర్వే చేశారన్నారు. కేంద్రం తొమ్మిది నగరాలను గుర్తిస్తే మన రాష్ట్రం నుంచి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం వాటర్‌ ప్లస్‌ సర్టిఫికెట్‌కు ఎంపికయ్యాయని చెప్పారు. అన్ని పట్టణాలను ఇలాగే తయారు చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 2.60 లక్షల టిడ్కో ఇళ్లు ఉన్నాయన్నారు. వీటన్నింటినీ లబ్ధిదారులకు అందించే ఏర్పాట్లను రేపటి నుంచే ప్రారంభిస్తామని తెలిపారు. ఆరునెలల్లో 80 వేలు, మరో ఆరునెలల్లో ఇంకో 80 వేలు, మిగిలినవి తర్వాత ఆరునెలల్లో ఇస్తామని స్పష్టం చేశారు. చదవండి: 'అగ్రిగోల్డ్‌' అసలు దొంగ చంద్రబాబే

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు