ఎవరిపైనా కక్షలేదు

5 Oct, 2020 05:52 IST|Sakshi

గోపాలపట్నం (విశాఖ): మాజీ ఎంపీ సబ్బం హరి పార్కు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన ఇంటి ప్రహరీ తొలగింపు విషయంలో చట్టం తన పని తాను చేస్తుందని.. తమకు ఎవరిపైనా కక్ష లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌ పనులు పరిశీలించేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కబ్జా విషయమై స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు నోటీసులు జారీచేశారని వివరించారు. ఆయన నోటీసులు తీసుకునేందుకు తిరస్కరించడంతో గోడకు అంటించారని.. కానీ, ఆయన వాటిని తీసుకుని ఉంటే వివరణ ఇచ్చేందుకు అవకాశముండేదని బొత్స అభిప్రాయపడ్డారు.

వివరణ ఇచ్చి ఉంటే ఆ చర్యలు మరోలా ఉండేవన్నారు. సబ్బం హరి వాడు వీడు అని సంభోదించడం దురదృష్టకరమని చెబుతూ.. రాజకీయ నాయకులు నోరు అదుపులో ఉంచుకోవాలని బొత్స హితవు పలికారు. విశాఖను రాజధానిగా చేయాలనుకుంటే వైఎస్సార్‌సీపీకి చెందిన విశాఖ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి గెలవాలని అయ్యన్నపాత్రుడు విసిరిన సవాల్‌ను చౌకబారు వ్యాఖ్యలుగా అభివర్ణించారు. ప్రభుత్వం పనితీరుపట్ల, సీఎం వైఎస్‌ జగన్‌ చేపడుతున్న సంక్షేమ పథకాలపట్ల ఆకర్షితులై ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కొందరు అధికార పార్టీకి మద్దతు తెలుపుతున్నారని చెప్పారు.  

మరిన్ని వార్తలు