వాస్తవాలు బయటకు వస్తాయనే రాద్ధాంతం

15 Mar, 2022 04:16 IST|Sakshi

మంత్రి బొత్స 

సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలు చర్చిస్తే వాస్తవాలు బయటకొస్తాయనే భయంతోనే టీడీపీ సభ్యులు శాసనసభలో గందరగోళం సృష్టిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. ఎల్లో మీడియా వండి వార్చిన అసత్య కథనాల ఆధారంగానే టీడీపీ నాయకుల ఆరోపణలు, ప్రశ్నలు ఉంటున్నాయన్నారు. వాటికి ప్రభుత్వం సమాధానం చెబుతుంటే.. ప్రజలకు నిజాలు తెలియనివ్వకుండా టీడీపీ సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు దూసుకెళ్లి.. పేపర్లు చించి విసిరేస్తూ రాద్ధాంతం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఇలాంటి ఘటనలను అందరూ ఖండించాలని కోరారు. ‘జంగారెడ్డిగూడెంలో వరుస మరణాల ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయనప్పటికీ ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. ఖననం చేసిన మృతదేహానికీ పోస్టుమార్టం చేయించింది. సహజ మరణాలను టీడీపీ రాజకీయం చేస్తోంది. చంద్రబాబు ఆదేశాలతో ఇక్కడ టీడీపీ సభ్యులు అల్లర్లు, గొడవలు సృష్టించారు. ప్రభుత్వ ప్రకటనను వినే ఓపిక వారికి లేదు. ఇకనైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి’ అని మంత్రి హితవు పలికారు.  

మరిన్ని వార్తలు