అజెండాలో లేని అంశంపై ఎలా చర్చిస్తాం!

5 Dec, 2020 05:14 IST|Sakshi

మండలిలో టీడీపీ సభ్యులపై మండిపడ్డ బొత్స

అజెండా ప్రకారమే చర్చించాలన్న బీజేపీ, పీడీఎఫ్‌ 

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్ట్‌ అంశంపై ముందు చర్చ జరపాలా.. అమరావతి రాజధాని అంశంపై చర్చించాలా అన్న దానిపై శుక్రవారం శాసనమండలిలో కొద్దిసేపు ఆసక్తికర చర్చ సాగింది. సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు అమరావతి అంశంపై చర్చకు వాయిదా తీర్మానం ఇవ్వగా.. చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ దానిని తిరస్కరించారు. ఆ తర్వాత కూడా దీనిపై చర్చ జరపాలంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. మంత్రి బొత్స జోక్యం చేసుకుని.. వాళ్లకు అల్లరి చేసి పబ్లిసిటీ పొందాలన్న తపన తప్ప చిత్తశుద్ధి లేదన్నారు. అమరావతి అంశాన్ని అజెండా తయారీ కోసం జరిపిన బీఏసీ సమావేశంలో ఆ పార్టీ సభ్యులు ప్రస్తావన చేయలేదన్నారు.

ఆ తర్వాత కూడా అమరావతిపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టడంతో చైర్మన్‌ షరీఫ్‌ సభను వాయిదా వేశారు. సభ ప్రారంభం కాగా.. అమరావతిపై చర్చకు టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడు పట్టుబట్టడంతో.. మంత్రి బొత్స మరోసారి జోక్యం చేసుకుని బీఏసీలో ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. పీడీఎఫ్‌ పక్ష నేత బాల సుబ్రహ్మణ్యం, బీజేపీ పక్ష నేత మాధవ్‌ కల్పించు కుని బీఏసీలో నిర్ణయించిన అజెండా ప్రకారమే చర్చ జరపాలని సూచించారు. చివరకు 311 కింద ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులపై చర్చ చేపట్టి, ఆ తర్వాత ప్రభుత్వ బిల్లులు, అమరావతిపై స్వల్పకాలిక చర్చ, ఆ తర్వాత పోలవరం, మరో రెండు అంశాలపై చర్చ చేపడతామని చైర్మన్‌ ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది.  

>
మరిన్ని వార్తలు