బెయిల్‌ ఇప్పించి నిరసనలా?

12 Nov, 2020 04:07 IST|Sakshi
మౌలానా ఆజాద్‌ జయంతి కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి బొత్స

సలాం కేసులో చంద్రబాబు తీరుపై బొత్స మండిపాటు 

నిందితుల తరఫున వాదించింది టీడీపీ లాయరే

సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లాలో అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులకు టీడీపీ నాయకుడు, న్యాయవాది వేదుర్ల రామచంద్రరావు ద్వారా బెయిలు ఇప్పించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు మరోవైపు నిరసనలకు పిలుపునివ్వటంపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో బొత్స మాట్లాడుతూ చంద్రబాబు సూచనలతోనే నిందితుల తరఫున వాదించి బెయిల్‌ ఇప్పించడం నిజం కాదా? అని సూటిగా ప్రశ్నించారు. ‘చంద్రబాబు చేసింది చాలక వృత్తి, ప్రవృత్తి అని మాట్లాడతారా? చేసిందంతా చేసి తిరిగి ప్రభుత్వంపై బురద జల్లుతారా? ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం జగన్‌ స్పందించి భార్యాబిడ్డలతో ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కారకులపై చర్యలు తీవ్రంగా ఉండాలని స్పష్టం చేస్తూ ఇద్దరు ఐపీఎస్‌ అధికారులతో విచారణకు ఆదేశించారు. నిందితులను ప్రభుత్వం 24 గంటల్లోనే అరెస్టు చేసి జైలుకు పంపితే చంద్రబాబు కుట్రలకు పదును పెట్టి నిరసనలకు పిలుపునివ్వడం విస్మయం కలిగిస్తోంది’ అన్నారు. 

బెయిల్‌ ఇప్పించారా.. లేదా?
‘నిందితులకు ప్రభుత్వం బెయిల్‌ ఇప్పించిందా? లేక టీడీపీ బెయిల్‌ ఇప్పించిందా?’ అనేది చంద్రబాబు సూటిగా చెప్పాలని బొత్స డిమాండ్‌ చేశారు. చటుక్కున బెయిలు వచ్చిందంటే చంద్రబాబు లాంటి మేనేజ్‌మెంట్‌ చేసే వాళ్లుంటేనే ఇలా జరుగుతుందన్నారు. ‘పైకోర్టుకు వెళ్లి బెయిలు రద్దుకు ప్రతిపక్షం డిమాండ్‌ చేయాలి. కానీ ప్రభుత్వమే నిందితుల బెయిలు రద్దు కోసం పిటిషన్‌ వేసింది. ఏ స్థాయికైనా వెళ్లి బెయిలు రద్దు చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సలాం ఆత్మహత్య కేసులో నిందితులకు బెయిల్‌ ఇప్పించిన కాపు కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ వేదుర్ల రామచంద్రరావు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ సాక్ష్యాలు చూపిస్తున్నాం’ అని బొత్స అన్నారు.

30 లక్షల ఇళ్లను అడ్డుకున్నారు: పేదలకు ఇళ్లు ఇస్తామంటే కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చారని, టీడీపీ లాంటి ప్రతిపక్షం ఉండటం మన ఖర్మని బొత్స పేర్కొన్నారు. 30 లక్షల ఇళ్లను ఇవ్వకుండా అడ్డుకున్నారని దుయ్యబట్టారు. 

ఘనంగా ఆజాద్‌ జయంతి: మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి సందర్భంగా బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ నేతలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు