బైజూస్‌ అంటే ఏమిటో నీ మనవడిని అడుగు

19 Jun, 2022 02:40 IST|Sakshi

బైజూస్‌తో ఒప్పందం తప్పని ఒక్క మేధావితోనైనా చెప్పించగలవా?

రాజకీయంగా పనైపోవడంతో అసహనంతో పిచ్చి ప్రేలాపనలు..

యూజ్‌లెస్‌ ఫెలో మాట్లాడేవన్నీ పనికిమాలిన మాటలే

చంద్రబాబుపై మంత్రి బొత్స ధ్వజం

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 35 లక్షల మంది విద్యార్థులకు అభ్యాసనాంశాల(కంటెంట్‌)ను ఉచితంగా అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం బైజూస్‌తో ఒప్పందం చేసుకుంటే.. అది బైజూసో.. జగన్‌మోహన్‌రెడ్డి జూసో అంటూ చంద్రబాబు వెటకారంగా మాట్లాడటం హేయం.. దారుణం అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బైజూస్‌ అంటే హెరిటేజ్‌లో అమ్మే జ్యూస్‌ అనుకుంటున్నావా  అంటూ ధ్వజమెత్తారు. బైజూస్‌ అంటే తెలియకపోతే.. నీ మనవడిని అడిగితే చెబుతాడని ఎద్దేవా చేశారు.

రెండు రోజులుగా విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించి ఒక్క అంశంపైనైనా మట్లాడారా? అని ప్రశ్నించారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో రిజిష్టర్‌ చేసుకున్న 150 మిలియన్ల విద్యార్థులకు కంటెంట్‌ అందిస్తున్న సంస్థ బైజూస్‌ అని చెప్పారు. ‘మీ కొడుకు, మనవడు మాత్రమే ఇంగ్లిష్‌లో చదవాలి.. వారు మాత్రమే విదేశాలకు వెళ్లాలి.. ఆ తర్వాత తిరిగి వచ్చి మీ మాదిరిగా దోచుకు తినాలి. ఇదేగా మీ ఉద్దేశం’ అని నిప్పులు చెరిగారు. మంత్రి బొత్స ఇంకేమన్నారంటే..

మతి స్థిమితం లేని మాటలు..
► నిరుపేదల పిల్లలు, గ్రామీణ విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియం చదువులు వద్దనేదే మీ లక్ష్యం. బైజూస్‌ ద్వారా ఆ విద్యార్థులు బాగా చదువుకునేలా ప్రోత్సహిస్తుంటే దానినీ ఎగతాళి చేస్తావా? బైజూస్‌తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం తప్పు అని ఒక్క మేధావితోనైనా చెప్పించగలవా చంద్రబాబూ?
► బైజూస్‌ యాప్‌ తీసుకోవాలంటే ఒక్కరికి కనీసం రూ.20 వేలు ఖర్చవుతుంది. అలాంటిది ఆ కంపెనీతో ఒప్పందం చేసుకుని 35 లక్షల మంది పేద పిల్లలకు ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నాం. దీనిని చంద్రబాబు ఎగతాళి చేయడం చూస్తే ఆయన మతి స్థిమితం కోల్పోయినట్లు స్పష్టమవుతోంది.
► రాజకీయాల్లో నీ కంటే పనికిమాలినోడు ఎవరైనా ఉన్నారా? నువ్వేమైనా రాజకీయాల్లో పుడుంగా? ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి దక్కించుకున్న అధికారాన్ని కాపాడుకోవడానికి ఎన్ని దిక్కుమాలిన పనులు చేశావో ఎవరికి తెలియదు? మళ్లీ అధికారంలోకి రావడానికి వాజ్‌పేయి, అద్వానీ, మోదీ కాళ్లు పట్టుకోలేదా? రాజకీయాల్లో నీకంటే యూజ్‌లెస్‌ ఫెలో ఎవరైనా ఉంటారా? రాజకీయంగా పనైపోవడంతో అసహనంతో పిచ్చిపట్టి నీచపు మాటలు మాట్లాడుతున్నావు. 

విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు 
► నారాయణ విద్యా సంస్థలకు మేలు చేసేందుకు ప్రభుత్వ విద్యా వి«ధానాన్ని చంద్రబాబు నీరుగార్చడం వాస్తవం కాదా? అందుకే చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 35 శాతం ఉంటే, ప్రైవేటు సంస్థల్లో చదివేది 65 శాతం.
► సీఎం వైఎస్‌ జగన్‌ నాడు–నేడు ద్వారా విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 60 శాతానికి పెరిగింది. 
► దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతి జిల్లాకూ యూనివర్సిటీ లేదా కాలేజీ వచ్చేలా చర్యలు తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం, మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ విజయనగరం జిల్లాలో ఇంజనీరింగ్‌ కాలేజీని జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయంగా మార్చారు. మెడికల్‌ కాలేజీని నిర్మిస్తున్నారు. చంద్రబాబూ.. విజయనగరంలో మీరు నిర్మించిన మెడకల్‌ కాలేజీ ఎక్కడుందో చూపగలవా?
► మహానేత వైఎస్‌ హయాంలోనే విశాఖ అభివృద్ధి చెందింది. తోటపల్లి ప్రాజెక్టును 85 శాతం వైఎస్‌ పూర్తి చేస్తే.. మిగిలిన 15 శాతం కూడా పూర్తి చేయలేక చంద్రబాబు చేతులెత్తేయడం నిజం కాదా? బాబు చెప్పే అబద్ధాలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మేము అప్పుడూ, ఇప్పుడూ ఒకేలా ప్రజలకు అండగా ఉన్నాం. చంద్రబాబూ.. సామాజిక న్యాయంపై చర్చకు సిద్ధమా? 

మరిన్ని వార్తలు