బాబు పాలనంతా కరువే.. వరదల్లేవ్‌

29 Jul, 2022 03:40 IST|Sakshi

పరామర్శ పేరుతో రాజకీయ పర్యటనలా?: మంత్రి బొత్స  

సాక్షి, అమరావతి: వరద ప్రాంతాల్లో బాధితులకు పరామర్శ పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాజకీయ పర్యటనలు నిర్వహిస్తున్నారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. వరద బాధితులకు అధికార యంత్రాంగం అండగా నిలిచిందని, తక్షణ సాయంతోపాటు శిబిరాలను ఏర్పాటు చేసి వసతులు కల్పించామని చెప్పారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆరు జిల్లాల్లో వరదలు ప్రభావం చూపాయని, గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో రాలేదని తెలిపారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పాటు పర్యటించి బాధితులను నేరుగా కలుసుకుని సహాయ చర్యలను పరిశీలించారని చెప్పారు. సహాయ కార్యక్రమాల్లో అందరూ కలసి పని చేయాలన్నదే ప్రభుత్వ అభిమతమన్నారు. దాదాపు 3.46 లక్షల మంది వరద ప్రభావానికి గురైనట్లు చెప్పారు. 219 సహాయ కేంద్రాలు నెలకొల్పి దాదాపు 1.80 లక్షల మందికి బస కల్పించి ఆహారం అందచేశామన్నారు. గోదావరి వరదల్లో ఏడుగురు చనిపోగా బాధిత కుటుంబాలకు పరిహారం అందించామన్నారు. 

నాడు కరువు కాటకాలమయం 
చంద్రబాబు వరద బాధితులను ఓదార్చడానికి బదులు రాజకీయ ఉపన్యాసాలు చేస్తున్నారు. రెండు నిమిషాలకు ఒకసారి సీఎం జగన్‌ని విమర్శించడమే ఆయన పని. చంద్రబాబు హయాంలో వరద బాధితులకు దుస్తుల కోసం రూ.2 వేలు, ఇతర సామాగ్రి కోసం మరో రూ.2 వేలు ఇచ్చారట. ఆయన ఎంత మందిని ఆదుకున్నారు? ఎక్కడ ఇచ్చారు? రూ.2.50 లక్షలతో ఎక్కడ, ఎన్ని ఇళ్లు కట్టించారు? చంద్రబాబు హయాంలో కరువు మినహా వరదలు ఎప్పుడొచ్చాయి? ఆయన పాలనంతా కరువు కాటకాల మయమే.  

చంద్రబాబు ఏమైనా నడిచి వెళ్లారా? 
చంద్రబాబు కరకట్ట నివాసం నుంచి కారు, హెలికాప్టర్‌లో కాకుండా ఏనాడైనా నడిచి వెళ్లారా? పోలవరం ప్రాజెక్టును వైఎస్సార్‌ ప్రారంభించి కాలువలు తవ్వించారు. చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చినా 2017 వరకు పిడికెడు మట్టి కూడా వేయలేదు. ఒక్క పని కూడా చేయలేదు. పోలవరాన్ని స్వయంగా కడతామని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. చివరకు హోదాను కూడా తాకట్టు పెట్టారు. పోలవరం పనులు ఎలా చేయాలో మాకు తెలుసు. నిధులు ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు. కేంద్రంపై ఏ విధంగా ఒత్తిడి తేవాలో కూడా తెలుసు. చంద్రబాబు మాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. పోలవరాన్ని ఏటీఎం మాదిరిగా ఎవరు వాడుకున్నారో సోము వీర్రాజు గతాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. 

మరిన్ని వార్తలు