చంద్రబాబుకు మతి తప్పింది

4 Aug, 2020 05:03 IST|Sakshi

ఆయన రాజధాని డిజైన్‌కు మంగళగిరి, తాడికొండ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు

టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లాలి

48 గంటల్లోగా మా సవాల్‌కు బాబు సమాధానం చెప్పాలి: మంత్రి బొత్స 

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు సోమవారం నిర్వహించిన ప్రెస్‌ మీట్‌ చూస్తే ఆయనకు మతిస్థిమితం పూర్తిగా లేదని రూఢీ అవుతోందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల ఎన్నికల్లో రాజధాని ప్రజలు ఇచ్చిన తీర్పు చంద్రబాబు రాజధాని డిజైన్‌కు చెంపపెట్టు అని చెప్పారు.

గ్రాఫిక్స్‌ రాజధాని పేరిట ఆయన చేసిన మోసాలకు, తన బినామీల భూముల రేట్లు పెంచుకునేందుకు విభజించిన జోన్లకు, చేసిన ల్యాండ్‌ పూలింగ్‌ దుర్మార్గాలకు రాజధాని ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు. చివరకు చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ను కూడా చిత్తుగా ఓడించారన్నారు.  ఈ మేరకు మంత్రి బొత్స సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకటన ముఖ్యాంశాలు ఇలా.. చంద్రబాబుకు ఎన్నికల మీద నమ్మకం ఉంటే తనతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో తక్షణం రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లాలి.  

► మేం విసురుతున్న ఈ సవాల్‌కు 48 గంటల్లోగా ఆయన సమాధానం చెప్పాలి. వికేంద్రీకరణను వ్యతిరేకించి చంద్రబాబు చరిత్రహీనుడుగా మిగిలిపోయారు. ఇక విశాఖ వెళ్లే హక్కు, ఉత్తరాంధ్రలో కాలు పెట్టే నైతిక అర్హత ఆయనకు లేదు. రాజధానులను వ్యతిరేకిస్తున్న ఆయన ఈ మూడింటిలో అమరావతి కూడా ఉందని మరిచిపోయారు. దీంతో ఆయన దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారని ప్రజలకు బాగా అర్థమవుతోంది.  

మరిన్ని వార్తలు