కేంద్ర విధానాల ప్రకారమే ఇళ్ల నిర్మాణ పథకం 

10 Oct, 2021 02:44 IST|Sakshi
విజయనగరంలో మీడియాతో మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ

ప్రభుత్వం ఇస్తున్న జీవోలను ఎవరి కోసం ఇస్తున్నామో కోర్టులు అర్థం చేసుకోవాలి

న్యాయస్థానాలపై, వాటి తీర్పులపై మాకు గౌరవం ఉంది

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

సాక్షి ప్రతినిధి, విజయనగరం: కేంద్ర ప్రభుత్వం సూచించిన విధివిధానాల ప్రకారమే రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణ పథకాన్ని చేపట్టామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పేదల ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు బాధనిపించిందని తెలిపారు. విజయనగరంలో శనివారం ఉదయం బొత్స మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, వారి తీర్పులపై తమకు పూర్తి గౌరవం ఉందని చెప్పారు. న్యాయస్థానాల అభిప్రాయాలతో తామెప్పుడూ విభేదించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఇస్తున్న జీవోలను ఏ స్ఫూర్తితో ఇస్తున్నాం.. ఎవరి కోసం ఇస్తున్నాం అనే వాటిపై న్యాయస్థానాలు ఆలోచించాలని విన్నవించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఇంకా ఏమన్నారంటే..

సింగిల్‌ జడ్జి తీర్పుపై అప్పీల్‌కు వెళ్తాం.. 
పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం స్థలం ఇవ్వడంతోపాటు దానికి తగ్గట్టుగా కొన్ని వేల కోట్ల రూపాయలతో సదుపాయాలు కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలను పేదలకు ఒక్కో ఇంటికి అందజేస్తోంది. కేంద్రం 220 చదరపు అడుగుల విస్తీర్ణంలో మాత్రమే ఇంటి నిర్మాణానికి అనుమతిస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 270 చదరపు అడుగుల విస్తీర్ణంలో పేదలకు ఇళ్లు నిర్మిస్తోంది. ఇవే నిబంధనల ప్రకారం.. దేశమంతా కడుతున్న ఇళ్ల నిర్మాణాలను ఆపేస్తారా? అలా ఆపేస్తే.. పేదలకు అసలు ఇళ్లు ఉంటాయా?. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా రాష్ట్రంలో ఇళ్లు కావాలని 30 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారంటే.. వాటిని చూసి బాధపడాలో.. సిగ్గుపడాలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు వెళ్తాం (తర్వాత ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది). పేదలకు న్యాయం జరిగేలా చేస్తాం. పక్కా ఇళ్ల నిర్మాణమనే యజ్ఞాన్ని టీడీపీ నేతలు సాంకేతిక అంశాలను ఆసరా చేసుకుని అడ్డుకుంటున్నారు. తమ పలుకుబడితో వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ పేదల పొట్టకొడుతున్నారు. దీన్ని ప్రజలెవరూ హర్షించరు. 

రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన ఘనత చంద్రబాబుదే..
ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ముందు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోవాలి. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన ఘనత బాబుదే. ఇరవై ఏళ్ల క్రితమే ప్రభుత్వ ఆస్తులను అమ్మిన ఆయనే ఇప్పుడు ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. గతంలో ఆయన అధిక టారిఫ్‌లకు విద్యుత్‌ కొనుగోలు చేయడం వల్లే ఇప్పుడు విద్యుత్‌ పంపిణీ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చెల్లించకుండా వదిలేసిన బకాయిలన్నింటినీ చెల్లిస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి వెళ్లిన చంద్రబాబు ఇవాళ నీతి కబుర్లు చెబుతుండటం విడ్డూరం.  

మరిన్ని వార్తలు