ఆస్తి పన్ను పెంపు 15 శాతం మించదు

17 Jun, 2021 03:51 IST|Sakshi

పన్ను పెంపుతో స్థానిక సంస్థలకు అదనంగా వచ్చేది రూ.186 కోట్లే

మంత్రి బొత్స స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: ఆస్తి పన్ను పెంపుపై ప్రతిపక్షాలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న ఆస్తి పన్నుపై పెంపుదల 15 శాతానికి మించకుండా ఉండేలా చట్టాన్ని రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ఆస్తి పన్ను ఎక్కడా 15 శాతానికి ఎట్టి పరిస్థితుల్లో మించదని స్పష్టం చేశారు. పన్ను విధింపులో ఇప్పటివరకు ఉన్న లోపభూయిష్ట విధానాన్ని మారుస్తున్నామని చెప్పారు. కేంద్రం సూచనల మేరకే ఆస్తి పన్ను మదింపు విధానాల్లో మార్పులు చేశామని, 3 రాష్ట్రాల్లో పన్ను వసూళ్లలో అమలవుతున్న విధానాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామన్నారు. పత్రికలు, ప్రతిపక్షాలు ప్రజలకు లేనిపోని అపోహలు కల్పించి.. ఆందోళనకు గురి చేయవద్దని కోరారు. నూతన విధానంలో ఏ ఒక్కరికీ భారం పడకూడదని, ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే సంస్కరణలు తెస్తున్నామని స్పష్టం చేశారు. 

అదనంగా వచ్చేది రూ.186 కోట్లు మాత్రమే
రాష్ట్రవ్యాప్తంగా 33.67 లక్షల అసెస్‌మెంట్లు ఉన్నాయని, కొత్త పన్ను విధానంలో స్థానిక సంస్థలకు అదనంగా వచ్చే ఆదాయం కేవలం రూ.186 కోట్లు మాత్రమేనని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఏటా రూ.1,242.13 కోట్ల ఆస్తి పన్ను వస్తుండగా.. కొత్త విధానంలో ఆ మొత్తం రూ.1.428.45 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసినట్టు చెప్పారు.  రూ.10 వేల కోట్ల ఆదాయం పెరుగుతుందంటూ ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని ధ్వజమెత్తారు. 375 చదరపు గజాలు ఉన్న ఇంటికి రూ.50 మాత్రమే పన్ను వేయాలని సీఎం జగన్‌ నిర్ణయించారన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోతుందని, ప్రభుత్వానికి నష్టం జరిగినా పేదవాడికి లాభం జరగాలన్నదే తమ ప్రభుత్వ విధానమన్నారు. బీజేపీ పాలిత కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో కూడా ఇదే పన్ను విధానం ఉందన్నారు.

ప్రజల బాధలు తెలిసిన ప్రభుత్వమిది
ఆస్తి పన్ను పెంపుపై టీడీపీ, బీజేపీ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని బొత్స అన్నారు. పేదవాడి ఆకలి బాధలు తెలిసిన ఈ ప్రభుత్వం వారికి ఇబ్బంది కలిగించే ఏ పనీ చేయదని చెప్పారు. ఆస్తి పన్ను పెంపుపై నగరాల్లో బహిరంగంగా చర్చ పెట్టే ఆలోచన ఉందన్నారు. పన్ను వసూళ్లలో దళారుల ప్రమేయం ఉండకూడదనేదే ప్రభుత్వ విధానమని, ఆస్తుల విలువ పెరిగితే అందుకు అనుగుణంగా నిర్ణీత శాతం మేరకు పన్నులు పెరుగుతాయన్నారు. చెత్తపై పన్ను విధించడాన్ని ప్రజలెవరూ వ్యతిరేకించడం లేదని చెప్పారు. చెత్త సేకరణకు కొన్నిచోట్ల ఇంటికి రూపాయి, కొన్ని ప్రాంతాల్లో రూ.2 నుంచి రూ.4 మాత్రమే వసూలు చేస్తారని తెలిపారు. 3 రాజధానుల ఏర్పాటుపై డీపీఆర్‌ సిద్ధమైందని చెప్పారు. ప్రభుత్వ సంకల్పం మంచిదని, 3 రాజధానులు ఏర్పాటు తప్పక జరుగుతుందన్నారు. 

మరిన్ని వార్తలు