కుప్పంలో ఎక్కడ రిగ్గింగ్‌ జరిగిందో బాబే చెప్పాలి

18 Feb, 2021 16:57 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు ఆడలేక మద్దెల ఓడు అన్న రీతిలో మాట్లాడుతున్నాడని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కుప్పంలో టీడీపీ కాదు ప్రజాస్వాయ్యం ఓడిపోయిందనడం ఒక్క చంద్రబాబుకే చెల్లిందన్నారు. తమ నాయకుడు చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్లే కుప్పంలో ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. కుప్పంలో ఎక్కడ రిగ్గింగ్‌ జరిగిందో బాబే చెప్పాలన్నారు. కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ఆయన మరీ రీకౌంటింగ్‌ ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో, ఏజెన్సీలో కూడా గెలిచామని చెప్తున్న చంద్రబాబు ఎక్కడ గెలిచారో నిరూపించాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా టీడీపీ గెలవలేదని, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన సలహాలను ఆయన తప్పుబడుతున్నారని చెప్పారు.

మీ హయాంలోనే కదా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు అంకురార్పణ జరిగిందని, అప్పుడేందుకు మీరు మాట్లాడలేదని మండిపడ్డారు. కనీసం ఇప్పుడైనా కేంద్రానికి లేఖ రాసే ధైర్యం ఎందుకు చేయడం లేదని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావడం చంద్రబాబుకు ఇష్టమేనని, అందుకే ఆయన హయాంలో దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని బొత్స పేర్కొన్నారు. అలాగే డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా మాట్లాడుతూ.. తన సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే చంద్రబాబు గెలవలేని పరిస్థితి వచ్చిందని ఎద్దెవా చేశారు. ప్రజలు చంద్రబాబును తిరస్కరించారని, ఓటమికి నైతిక భాధ్యత వహిస్తూ బాబు రాజీనామా చెయ్యాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు లాంటి నాయకత్వం అవసరమా అని తెలుగుదేశం నాయకులు ఆలోచించుకోవాలన్నారు.  దివంగత నేత ఆశయాలు పుణికి పుచ్చుకున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డివ అధికారం చేపట్టిన 18 నెలల్లోనే ఇచ్చిన హామీలను 100 శాతం పూర్తి చేశారని తెలిపారు. ఏ రాష్ట్రంలో కూడా ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చిన పరిస్థితులు లేవని, ఆ ఘనత సీఎం జగన్‌కే సొంతమని ఆయన అన్నారు.

>
మరిన్ని వార్తలు