అంతకంటే పైసా పెంచం.. అపోహలు వద్దు: బొత్స

16 Jun, 2021 19:35 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆస్తి పన్నుపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజకీయ పార్టీలు ఉనికిని కాపాడుకునేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత టీడీపీ నేతలకు లేదని చురకలు అంటించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆస్తిపన్నుపై పదే పదే చెప్తున్నా ఆరోపణలు చేస్తున్నారు. గతంలో ఉన్న విధానాన్ని మార్చి.. మధ్యవర్తులు లేనివిధంగా విధానం తెచ్చాం. కేంద్రం, 15వ ఆర్థిక సంఘం కూడా సూచనలు చేసింది. దీనిపై 3 కమిటీలు ఏర్పాటు చేసి 3 రాష్ట్రాలకు పంపి అధ్యయనం చేశాం.

15 శాతం కంటే పైసా కూడా పెంచే అవకాశం లేదు
ఇప్పుడున్న అద్దెపై పన్ను విధానం స్థానంలో విలువ ఆధారితంగా పన్ను వేశాం. 0.10 నుంచి 0.15 శాతం మేర పెంచుకునే వెసులుబాటు ఇచ్చాం. 0.20 నుంచి 2 శాతం వరకు వాణిజ్య సముదాయాలకు పెంచాం . కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంది...వారి విధానం కూడా పరిశీలించాం.100 శాతం పెరిగితే భారం అవుతుందని భావించి 15 శాతం కంటే మించకూడదని నిర్ణయించాం. టాక్స్ పేయర్స్ నిర్ణయాలు, అభిప్రాయాలు కూడా తీసుకున్నాం. ఇప్పుడున్న పన్ను కంటే 15 శాతం కంటే పైసా కూడా పెంచే అవకాశం లేదు. ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించవద్దు... ప్రజలు ఇబ్బంది పడకూడదని ఆలోచించే వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. 

మేము చేసే ఎన్నో విధానాలను కేంద్రం, ఇతర రాష్ట్రాలు అవలంబిస్తున్నాయి . జయదేవ్ గారు... పన్నుల గురించి మీరు మాకు సుద్దులు చెప్పక్కర్లేదు. కేంద్రం చెప్తే చేశామని మేము ఎక్కడా చెప్పలేదు.. చెప్పం కూడా . ఒక ఇంటికి అద్దెకు కొలమానం లేదు...అవకతవకలు జరిగే అవకాశం ఉంది. ఏ రాజకీయ నాయకుడు, అధికారి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు . స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే శాసన సభలో చట్టం చేశాం. 33.67 లక్షల ఇళ్లకు రాష్ట్రంలో ఇంటి పన్ను కడుతున్నారు. 1242.13 కోట్ల పన్ను ప్రస్తుతం వస్తోంది.1428.45 కోట్లు పెంచిన విధానం వల్ల ఇప్పుడు రానుంది. 128 కోట్లు మాత్రమే అధికంగా వస్తుంది. 375 చదరపు అడుగులు ఉన్న ఇంటికి 50 రూపాయలు మాత్రమే ఇంటి పన్ను వేయాలని సీఎం ఆదేశించారు

3.96 లక్షల ఇళ్లు 375 చదరపు అడుగుల ఇళ్లు ఉన్నాయి... వాటన్నిటికీ 50 రూపాయలు పన్ను దీనివల్ల 13 కోట్లు ప్రభుత్వానికే నష్టం వస్తుంది. అయినా పేదల కోసం భరిస్తాం. ఏదీ దాపరికం లేకుండా ఉండాలని ఈ ప్రభుత్వం స్పష్టంగా ఉంది. బీజేపీ చెప్తే మెమెందుకు చేస్తాం...మాకు విధానం లేదా..ఆలోచన లేదా..? ప్రజల కష్టాలు ఇబ్బందులు ఏమిటో..వాళ్లెం కోరుకుంటున్నారో మాకు తెలుసు. కోవిడ్ సమయంలో ప్రజల్ని ఏ విధంగా అదుకున్నామో అందరూ చూశారు. ముఖ్యమంత్రి ముందస్తు ఆలోచనతో థర్డ్ వేవ్ పై కూడా ఆలోచన చేస్తున్నారు. దళారులకు, మధ్యవర్తులకు తావు లేకుండా ప్రజలకు భారం లేకుండా 15 శాతం తగ్గకుండా పెంచుతున్నాం. జన్మభూమి కమిటీల్లా దోచుకుతినకూడదు’’ అని పేర్కొన్నారు.

చెత్త సేకరణకు ఇంటికి రూపాయి
‘‘కరోనా కాలంలో కట్టలేక పెనాల్టీ పడితే దానిపై నిర్ణయం తీసుకుంటాం. చెత్త సేకరణకు ఇంటికి రూపాయి...దానికి కూడా ఇబ్బందేనా..? . దేశంలో చాలా రాష్ట్రాల్లో చూసి వచ్చాం...వాళ్లంత పన్ను మేము వేయడం లేదే..? పేద వాడి కష్టం మా ముఖ్యమంత్రికి తెలిసినట్లుగా ఎవరికి తెలియదు. పేద వారి గురించి మాట్లాడే పేటెంట్ మా నాయకుడికే ఉంది. ఏ రోజైతే శాసనసభలో రాజధానిపై మా విధానం చెప్పామో.. ఆ రోజు నుంచే ప్రక్రియ ప్రారంభం అయ్యింది...దాన్ని అమలు జరపాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది.

టీడీపీ లాంటి కొన్ని దుష్టశక్తులు దీన్ని అడ్డుకోవాలని చూస్తున్నాయి. సంకల్పం మంచిదైతే ఏదీ ఆగదు..మా ముఖ్యమంత్రి మంచి సంకల్పించారు. మహాత్మా గాంధీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం స్పూర్తితో మేము సచివాలయ వ్యవస్థ తెచ్చాం. మేము వారిని అర్థం చేసుకోవడంలో తప్పు ఉందో లేక మమ్మల్ని వారు అర్థం చేసుకోవడంలో తప్పు ఉందో అర్థం కావడం లేదు. తెల్లవారు జామునే పింఛన్ ఇస్తున్నారు..వద్దా అది..? మాన్సాస్‌ ట్రస్ట్ విషయంలో పై కోర్టులు కూడా ఉన్నాయి. ఇదే అశోక్ గజపతి రాజు వాళ్ళ అన్న చైర్మన్ గా ఉన్నపుడు ఈ ట్రస్ట్ ఉండొద్దని లేఖ రాసింది నిజం కాదా..?’’ అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

చదవండి: మైలవరం: టీడీపీ నేత దేవినేని ఉమాకు చేదు అనుభవం

మరిన్ని వార్తలు