Botsa Satyanarayana: ఎన్నికల బహిష్కరణ టీడీపీ డ్రామానే 

21 Sep, 2021 07:44 IST|Sakshi

చంద్రబాబుకు ఓటమిని అంగీకరించే ధైర్యంలేదు 

అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు 

ఏపీ ప్రజలు సంక్షేమానికి పట్టం కట్టారు 

లబ్ధిదారులకు త్వరలో 80వేల టిడ్కో ఇళ్లు మంత్రి బొత్స సత్యనారాయణ 

సాక్షి, అమరావతి: పరిషత్‌ ఎన్నికల బహిష్కరణ టీడీపీ ఆడిన డ్రామా అని మునిసిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమాభివృద్ధి పాలనకు ప్రజలు మరోసారి పట్టం కట్టారని చెప్పారు. ప్రతిపక్షం తన పాత్రను పోషించకుండా ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని అబద్ధాలు ప్రచారం చేసిందన్నారు. ఓట్లు వేసిన ప్రజలకు ఏమీ తెలియదు.. వారు అమాయకులని అనుకుంటే పొరపాటేనని ఆయనన్నారు. చంద్రబాబుకి ఓటమిని అంగీకరించే ధైర్యంలేదని.. పరాజయాన్ని అంగీకరించి ఫలితాలను విశ్లేషించుకోవాలని బొత్స హితవు పలికారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్‌ వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

మళ్లీ ఎన్నికలు పెట్టాలన్న టీడీపీ నేత అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరంలేదని కొట్టిపారేశారు. సీఎం జగన్‌ గృహ నిర్మాణాలపై సోమవారం సమీక్ష నిర్వహించారని.. సుమారు 60 లక్షల మందికి శాశ్వత ఇళ్ల పట్టాలను ఇవ్వాలన్నదే ఆయన ఆలోచనన్నారు. దీనిపై విధివిధానాల గురించి ముఖ్యమంత్రి సమీక్షించారని బొత్స తెలిపారు. త్వరలోనే 80 వేల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని ఆయన వెల్లడించారు.

‘పరిషత్‌’ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించాలని తీర్పు వచ్చిన రోజు నుంచి టీడీపీలో ఆందోళన మొదలైందన్నారు. తమ సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తారని ఎన్నికల ఫలితాలతో నిరూపితమైందని మంత్రి తెలిపారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు పనైపోయిందని.. టీడీపీకి ప్రజల్లో మనుగడ లేదనేది స్పష్టమవుతోందని మంత్రి చెప్పారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలతో టీడీపీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. నామినేషన్లకు ముందే ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని ప్రకటించి ఉండాల్సిందని.. అవి పూర్తయిన అనంతరం చేతకాక బహిష్కరించారని బొత్స చెప్పారు. 
ప్రజాతీర్పు స్ఫూర్తితో సీఎం జగన్‌ ప్రజాసేవకు పునరంకితమవుతారన్నారు.

అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలి 
ప్రభుత్వాన్ని రద్దు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేయడం సరైంది కాదన్నారు. అచ్చెన్నాయుడుని తన పదవికి రాజీనామా చేయమనండి.. తానూ చేస్తానని.. ఇద్దరం పోటీచేసి తేల్చుకుందామని బొత్స సత్యనారాయణ చెప్పారు. స్థాయిని తగ్గించుకునేలా టీడీపీ నేతలు మాట్లాడొద్దన్నారు. చంద్రబాబుని చంపడానికి, కొట్టడానికే ఆయన ఇంటికి వైఎస్సార్‌సీపీ నేతలు వెళ్లారనడం సరికాదని చెప్పారు.

 

చదవండి: ఈ ఫలితాలు నా బాధ్యతను మరింత పెంచాయి: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు