టీడీపీ నేతల ఇళ్లను దిగ్భందం చేయాలి

11 Nov, 2020 14:17 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: నంద్యాల ఘటనపై టీడీపీ రాజకీయం చేయాలని చూస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకున్నారని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ఎప్పుడైనా ఇంత వేగంగా స్పందించారా అన్నారు. ఘటనకు పాల్పడిన వారిపై 306 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశామని తెలిపారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే నిందితుల తరపున టీడీపీ లాయర్లు వాదించారని పేర్కొన్నారు. నంద్యాల ఘటనపై రాష్ట్రమంతటా విచారణ వ్యక్తం చేస్తే.. టీడీపీ తమ లాయర్‌తో నిందితులకు బెయిల్‌ పిటిషన్‌ వేయించారన్నారు. 306 సెక్షన్‌ బెయిలబుల్‌ సెక్షనా? అని ఆయన ప్రశ్నించారు. బెయిల్‌ రద్దయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని మంత్రి చెప్పారు. (చదవండి: బెయిలడిగేదీ వారే... బురద జల్లేదీ వారే!)

పేదలకు ఇళ్లు ఇద్దామంటే టీడీపీ నేతలు కోర్టుకు వెళ్తున్నారని, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటారన్నారన్నారు.  పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్న టీడీపీ నేతల ఇళ్లను దిగ్బంధం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉండగా టీడ్కోలో ఒక్క ఇళ్లైనా లబ్దిదారులకు అందిందా అని, పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో టీడీపీ నేతలు దోచుకున్నారని మంత్రి ఆరోపించారు. టిడ్కోలో భారీ అవినీతి జరిగిందని సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ముందే చెప్పారన్నారు. అధికారంలో వచ్చాక 300 చదరపు అడుగుల ఇంటిని ఉచితంగా ఇస్తామని ప్రకటించారని, 30 లక్షల మందికి ప్రభుత్వం ఇళ్లు ఇస్తామంటే కోర్టులకు వెళ్లి టీడీపీ నేతుల అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. నిరసన ర్యాలీలు చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఇళ్ల ముందు చేయాలని బొత్స వ్యాఖ్యానించారు. (చదవండి: కుటుంబం ఆత్మహత్యపై విచారణకు సీఎం ఆదేశం)

మరిన్ని వార్తలు