అడ్డుకోవడం.. ఐదు నిమిషాల పని 

26 Sep, 2022 03:55 IST|Sakshi

విశాఖ సదస్సులో మంత్రి బొత్స ఉద్వేగ ప్రసంగం  

శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే సంయమనం 

రాజధానిపై ఓ న్యాయమూర్తి వ్యాఖ్యలు బాధాకరం 

ఉన్నత పదవుల్లో ఉన్నంత మాత్రాన ఇష్టారీతిగా మాట్లాడకూడదు 

ఇప్పుడు కూడా స్పందించకపోతే పెను ప్రమాదం వాటిల్లే అవకాశం  

కాకినాడ నుంచి ఇచ్ఛాపురం వరకు అందరూ కదలాల్సిన అవసరం ఉంది 

సాక్షి, విశాఖపట్నం: ‘‘విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసుకోవచ్చనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకానీ ఏ ఒక్కరినో ఇబ్బంది పెట్టాలని,  కించపరచాలని కాదు. పాదయాత్రల్ని అడ్డుకోవడం, దండయాత్రలు చేయడం 5నిమిషాల పని. కానీ వ్యవస్థని గౌరవించాలి. శాంతి భద్రతల్ని కాపాడుకోవాలనే సంయమనం పాటిస్తున్నాం. దురదృష్టం ఏమిటంటే 29 గ్రామాల్లో రియల్‌ ఎస్టేట్‌ అమ్మకాలు, వ్యవహారాల అంశాన్ని 26 జిల్లాలకు ముడిపెట్టి ఆందోళనలు చేయడం బాధ కలిగిస్తోంది.

రాష్ట్రంలోని 26 జిల్లాలను అభివృద్ధి చేయాలని అనుకోవడం ధర్మం. దానికి కట్టుబడి ఉండకపోతే నా మంత్రి పదవికి అర్హుడిని కాదు. రాష్ట్రాభివృద్ధి కోసం దీన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా’ అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం విశాఖలో జరిగిన పాలనా వికేంద్రీకరణ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ వివరాలివీ..

పన్నులు, ఆదాయం మట్టిలో పోయాలా?
అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలి, 5 కోట్ల మందికీ ఫలాలు అందాలి.. ఏ ఒక్కరికీ అసంతృప్తి ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వనరులు, వసతులపై సమగ్ర అధ్యయనం అనంతరం సీఎం మూడు రాజధానులపై ప్రకటన చేశారు. అమరావతి ఈ రాష్ట్రంలో ఒక భాగమే. అమరావతి రాజధానికి ప్రభుత్వం వ్యతిరేకం కాదు.

రాజధానిని విజయవాడ, గుంటూరు నగర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ఉంటే రూ.5 వేలు లేదా రూ.10 వేల కోట్లు సమకూర్చుకుంటే సరిపోయేది. అమరావతిలో ఆ పరిస్థితి లేదు. రూ.1.09 లక్షల కోట్లు అవసరమని గణాంకాలు వెల్లడించాయి. దీనిపై విచారణ జరిపి ఆర్గనైజింగ్‌ చేసిన కంపెనీకి రూ.400 కోట్లు ఫీజు రూపంలో చెల్లించినట్లు గుర్తించాం.

29 గ్రామాల పరిధిలో కాకుండా మిగిలిన ఏ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టినా 50›% ఖర్చు తగ్గుతుందని అర్థమైంది. ఎందుకింత వ్యత్యాసమని పరిశోధనలు చేస్తే అమరావతిలో పునాదులు తవ్వాలంటే వందల అడుగుల లోతుకు వెళ్లాల్సిన పరిస్థితులున్నాయి. ప్రజలు కట్టే పన్నులు, ఆదాయం మొత్తం అక్కడి మట్టిలో పోయాల్సి వస్తుంది. దీనిపై అధికారికంగా వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.  

ల్యాండ్‌ పూలింగ్‌ చట్టం ప్రకారమే అక్కడ భూముల సమీకరణ చేశారు. అక్కడ అగ్రిమెంట్‌ రియల్‌ ఎస్టేట్‌ మాదిరిగా జరిగింది. గత ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం కంటే అదనంగా అమరావతి రైతులకు చెల్లింపుల సమయాన్ని సీఎం పొడిగించారు. 

అమరావతి రైతులు బాబును నిలదీయాలి
వీళ్లు చేస్తోంది పాదయాత్రా.. దండయాత్రా..? రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల సంపాదన కోసం చేస్తున్న యాత్రా? టీడీపీ రాజకీయ యాత్రా? అనేది అర్థం కావడం లేదు.

విశాఖను రాజధానిగా చేస్తే మీకొచ్చిన నష్టం ఏమిటి? అప్పటి అగ్రిమెంట్‌లో అమరావతిలోనే రాజధాని ఏర్పాటు చేయాలని ఏమైనా వాక్యం ఉందా.? మీతో లాలూచీ పడిన చంద్రబాబుని ఈ విషయంపై అమరావతి రైతులు నిలదీయాలి. పాదయాత్రకు స్వాగతం పలుకుతామంటున్న నాయకుల్ని అడుగుతున్నా. ఉత్తరాంధ్రలో రాజధాని పెడితే మీకొచ్చిన నష్టం ఏంటి? 

ఎన్టీఆర్‌ దయతోనే ఉత్తరాంధ్ర ప్రజలు అన్నం తిన్నారు
ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.రెండు కిలో బియ్యం ఇచ్చాక ఉత్తరాంధ్ర ప్రజలు అన్నం తిన్నారు. అప్పటివరకూ రాగులే ఆహారం. వైఎస్సార్‌ సీఎం అయ్యాక జలయజ్ఞంతో పంటలు పండి వలసలు ఆగాయి. గతంలో ఉత్తరాం«ధ్ర రైల్వే స్టేషన్లు వలస వెళ్లే కూలీలతో కిటకిటలాడేవి. వైఎస్సార్‌ నిర్ణయాలతో వలసలు ఆగాయి.

ఇందులో ఏ ఒక్కటి అబద్ధం అయినా నేను తలదించుకుంటా. వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే మన తల్లిని మనం అవమానించుకున్నట్లే.

మేం కూడా మీలాగే ఆలోచిస్తే..
చంద్రబాబు ప్రతి కార్యక్రమం ఆయన కుటుంబం, వ్యక్తిగత లబ్ధి కోసమే చేస్తారు.  వైఎస్సార్, వైఎస్‌ జగన్‌ సామాజిక అభివృద్ధి కోసమే పథకాలు, కార్యక్రమాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు చేతకానివాళ్లని భావించొద్దు. ఈ పోరాటాన్ని కొనసాగించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. అన్ని సంఘాలకూ లేఖలు రాయాలి.

ప్రతి వారం, 15 రోజులకు సమావేశం నిర్వహించి దానికనుగుణంగా పోరాటం కొనసాగించాలి. 500 కుటుంబాల కోసం ఈ రాష్ట్ర సంపదని తాకట్టు పెట్టాలనడం భావ్యం కాదు.

శాసన రాజధానిని అమరావతిలో కొనసాగిస్తే మీకొచ్చిన ఇబ్బంది ఏమిటి? విశాఖలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే ముంబైని తలదన్నే నగరంలా అభివృద్ధి చెందుతుంది. కొన్ని రాజకీయ పార్టీలు దుర్మార్గంగా ఆలోచనలు చేస్తున్నాయి. మేం కూడా మీలాంటి ఆలోచనలతో ఉంటే విశాఖలో సగం ప్రాంతం మా పరిధిలోనే ఉండేది.

హైకోర్టు బెంచ్‌ విశాఖలో ఏర్పాటు చేయాలన్నది ఇప్పటి డిమాండ్‌ కాదు. దీన్ని కూడా రాజధాని ఏర్పాటైన తర్వాత పెడతాం. రాజకీయాలకు అతీతంగా ర్యాలీని త్వరలోనే నిర్వహిద్దాం.

న్యాయమూర్తి మాటలు బాధాకరం..
ఇటీవల రాజధానిపై ఒక న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికరంగానూ, బాధాకరంగా ఉన్నాయి. రాజ్యాంగం బద్ధంగా మాట్లాడే అవకాశం అందరికీ ఉంటుంది. కానీ సంయమనం పాటించాలి. ఇలాంటి పరిస్థితులకు మీలాంటి వారు కూడా కారణమే. ఉన్నత పదవుల్లో ఉన్నంత మాత్రాన ఇష్టారీతిగా మాట్లాడకూడదు. ఇప్పుడు పదవుల్లో ఉండొచ్చు.

కానీ మన గతం కూడా గుర్తుంచుకోవాలి. పత్రికా యాజమాన్యాలు కూడా ఆలోచన చేయాలి. ఈ ప్రాంతం నుంచే పెద్దవాళ్లయ్యారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. వర్గ విబేధాలు, ప్రాంతీయ విబేధాలు తీసుకురావొద్దని హెచ్చరిస్తున్నాం. 

మరిన్ని వార్తలు