డీఎంకే, కాంగ్రెస్‌లకు కుటుంబమే ముఖ్యం

2 Apr, 2021 04:15 IST|Sakshi
తిరుక్కోవిలూర్‌ బహిరంగ సభలో అమిత్‌ షా

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే, బీజేపీ ప్రజా సంక్షేమానికి అంకితమైన పాలనను అందిస్తుంటే, డీఎంకే, కాంగ్రెస్‌లు తమ హయాంలో కుటుంబ ప్రయోజనాలకు పాటుపడ్డాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దుయ్యబట్టారు. తమిళనాడు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి అభ్యర్థులను బలపరుస్తూ గురువారం ప్రచారం చేశారు. పుదుచ్చేరీలో ఉదయం రోడ్‌షో ముగించుకుని మధ్యాహ్నం తమిళనాడు రాష్ట్రం విళుపురం జిల్లా తిరుక్కోయిలూరులో జరిగిన బహిరంగ సభలో అమిత్‌షా ప్రసంగించారు.

మహిళలను, మాతృమూర్తులను కించపరుస్తూ అసభ్య పదజాలం ప్రయోగించే డీఎంకే–కాంగ్రెస్‌ కూటమికి ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. ‘ఎన్‌డీఏకూ అవినీతితో కూడిన డీఎంకే–కాంగ్రెస్‌ కూటమికి మధ్య పోటీ జరుగుతోంది. తమిళనాడును పాలించిన ఎంజీఆర్‌ నిజమైన ప్రజా సేవకునిగా వెలుగొందారు. దేశంలో పేద ప్రజల కోసం పాటుపడిన వ్యక్తులు ఎవరని సగర్వంగా గుర్తించాల్సి వస్తే ముందు ఎంజీఆర్, ఆ తర్వాత జయలలిత పేర్లను ప్రకటించాలి’అని ఆయన కోరారు. ప్రజా పరిపాలనలో జయలలిత అందరికీ ముఖ్యంగా మహిళలకు ఆదర్శంగా నిలిచారని శ్లాఘించారు. ప్రస్తుతం ప్రధాని మోదీ మార్గదర్శకంలో పళనిస్వామి, పన్నీర్‌సెల్వం అభివృద్ధి దిశగా జనరంజక పాలన అందిస్తున్నారన్నారు.

డీఎంకే, కాంగ్రెస్‌లకు లంచాలు, రౌడీయిజం, భూ కబ్జా, కుటుంబ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం అని విమర్శించారు. ఎంజీఆర్‌ సేవలకు గుర్తింపుగా చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌కు ఆయన పేరునే పెట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కిందని చెప్పారు. ఇటీవలే కన్నుమూసిన ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి తల్లిని ఉద్దేశించి ఇటీవల డీఎంకే నేత రాజా చేసిన కించపరిచే వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా చేశాయని చెప్పారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని డీఎంకే నేతలు అసభ్య పదజాలాన్ని ప్రయోగిస్తున్నారన్నారు. గతంలో జయలలితను సైతం డీఎంకే దూషించిన సంగతిని ప్రజలు మరువజాలరని చెప్పారు. జల్లికట్టుపై నిషేధానికి కారణం రాహుల్‌గాంధీ, అయితే నేడు అదే జల్లికట్టు గురించి డీఎంకే, కాంగ్రెస్‌ నేతలు అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు.  

నేడు మధురైలో ప్రధాని మోదీ ప్రచారం
ప్రధాని నరేంద్రమోదీ గురువారం రాత్రి మధురైకి చేరుకున్నారు. 2వ తేదీన మధురై, కన్యాకుమారిల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం తదితరులు ఆయనతోపాటు ప్రచారంలో పాల్గొంటారు.  

మరిన్ని వార్తలు