స్విస్‌ నల్లధనంపై మోదీ మాట్లాడరేం ?

19 Jun, 2021 03:21 IST|Sakshi

ప్రశ్నించిన కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: అధికారంలోకి వస్తే స్విట్జర్లాండ్‌లోని నల్లధనాన్ని బయటకు తీసుకొస్తానని వాగ్దానం చేసిన మోదీ ప్రస్తుతం నల్ల ధనం గురించి ఎందుకు మాట్లాడటం లేదని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాని మోదీని ప్రశ్నించింది. స్విస్‌లో ఖాతాలు కలిగి నల్లధనం దాచుకుంటున్న వారి పేర్లను బయటపెట్టాలని కాంగ్రెస్‌ అధికారప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. అంతేగాక విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును తెచ్చేందుకు మోదీ తీసుకున్న చర్యలేమిటో వివరించాలని, దానిపై ప్రభుత్వం ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. 2020లో స్విస్‌ బ్యాంకులో భారతీయులు దాచుకున్న నల్ల ధనం విలువ ఏకంగా 286 శాతం పెరిగి రూ. 20,700 కోట్లకు చేరుకుంది. గత 13 ఏళ్లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాని మోదీని టార్గెట్‌ చేసింది.

కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా దీనిపై స్పందిస్తూ.. ‘మోదీజీ దయ చేసి సమాధానం ఇవ్వండి. నల్ల ధనాన్ని మూడేళ్లలో తీసుకొస్తానన్న మీ వాగ్దానం ఏమైంది. ఇప్పటికే మీరు అధికారంలోకి వచ్చి ఏడేళ్లయింది. మీ స్నేహితుల డబ్బును తీసుకొచ్చేందుకు మీకు శక్తి లేదా ?’అని ట్వీట్‌చేశారు. ఓ వైపు కరోనా కారణంగా పేదలు మరింత పేదలవుతుంటే, స్విస్‌ బ్యాంకులో రికార్డులు బద్దలు చేస్తూ నల్లధనం పోగవుతోందని కాంగ్రెస్‌ విమర్శించింది. దీనిపై మోదీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, స్విస్‌ బ్యాంకు ఖాతాదారుల పేర్లు బయటపెట్టాలని డిమాండ్‌చేస్తోంది.  

>
మరిన్ని వార్తలు