దర్యాప్తు సంస్థల దుర్వినియోగం

14 Mar, 2023 02:02 IST|Sakshi

పార్లమెంటులో బీఆర్‌ఎస్‌ ఆందోళన 

సభలో వాయిదా తీర్మానాలు.. కార్యక్రమాల స్తంభన 

ప్రతిపక్ష పార్టీలతో కలిసి నినాదాలు 

గాంధీ విగ్రహం వద్ద నిరసన  

రాజకీయం చేసేందుకే లిక్కర్‌ కేసు పొడిగింపు: కేకే 

సాక్షి, న్యూఢిల్లీ: దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని దేశంలో బీజేపీ రాజకీయం చేస్తోందని బీఆర్‌ఎస్‌ ఎంపీలు మండిపడ్డారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలే లక్ష్యంగా ఈడీ, సీబీఐ లాంటి వాటిని ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. ఈ మేరకు సోమవారం పార్లమెంటులో ఆందోళన చేపట్టారు. తొలుత పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద దర్యాప్తు సంస్థల తీరుపై నిరసన తెలిపారు. ఆ తర్వాత ఉభయ సభల్లో కార్యకలాపాలను స్తంభింపజేసే ప్రయత్నం చేశారు.

ఆయా అంశాలపై ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చించాలని పట్టుబట్టారు. ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఉభయ సభలను తొలుత మధ్యాహ్నం 2 గంటలకు, అనంతరం మంగళవారం ఉదయం 11 గంటలకు రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్‌లు వాయిదా వేశారు. అనంతరం విజయ్‌చౌక్‌లో పార్టీ ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్య యాదవ్‌లతో కలిసి బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు మీడియాతో మాట్లాడారు.  

రాజకీయం చేసేందుకే ఢిల్లీలో తమాషా 
సీబీఐ, ఈడీలతో పాటు గవర్నర్లను తమకు అనుకూలంగా మార్చుకొని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం వేధింపులకు గురిచేస్తోందని కేకే ఆరోపించారు. వీటిని అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని చెప్పారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను పార్లమెంటులో ఎండగడతామని అన్నారు.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో గత ఏడాది సెప్టెంబర్‌లోనే తొలి అరెస్టు జరిగినప్పటికీ, కావాలని రాజకీయం చేసేందుకు కేంద్రం కేసును పొడిగిస్తోందని ఆరోపించారు. ఈ కేసులో దర్యాప్తు, విచారణల గురించి ఎవరూ భయపడట్లేదని..కానీ సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు చట్ట ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 

కేసీఆర్‌ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ఆలోచన
గత తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలను ఒక మాదిరిగా.. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలను మరో మాదిరిగా చూస్తోందని లింగయ్య యాదవ్‌ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సహా ఇతర అంశాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, మా నిధులు మాకు కావాలంటూ సీఎం కేసీఆర్‌ గళం విప్పారన్నారు. అప్పటినుంచి ప్రధాని మోదీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

కేసీఆర్‌ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్న ఆలోచనతోనే ఎమ్మెల్సీ కవితపైకి ఈడీని ఉసిగొల్పారని ఆరోపించారు. తమ పోరాటం ప్రజాస్వామ్యయుతంగా, న్యాయబద్ధంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు