ఎమ్మెల్యే కోటా అభ్యర్థులు వీరే 

8 Mar, 2023 02:04 IST|Sakshi

ఖరారు చేసిన సీఎం,  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 

కుర్మయ్యగారి నవీన్‌కు రెండోసారి అవకాశం 

దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డికి చాన్స్‌ 

9న కేబినెట్‌ భేటీలో గవర్నర్‌ కోటా అభ్యర్థుల ఎంపిక 

సాక్షి, హైదరాబాద్‌: ఆశావహుల్లో ఉత్కంఠకు తెరదించుతూ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ఖరారు చేశారు. శాసనమండలిలో ఈ నెల 29న ఖాళీ అవుతున్న మూడు ఎమ్మెల్యే కోటా స్థానాల కోసం నామినేషన్ల దాఖలుకు గడువు ఈ నెల 13న ముగియనుంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను కేసీఆర్‌ ప్రకటించారు.

ప్రస్తుత ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్‌రావుకు మరోమారు అవకాశం ఇవ్వగా, కొత్తగా రచయిత, గాయకుడు దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డిని ఎంపిక చేశారు. ఈ నెల 9న వీరు తమ నామినేషన్‌ పత్రాలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయాల్సిందిగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కేసీఆర్‌ ఆదేశించారు.  

‘గవర్నర్‌’అభ్యర్థుల ఖరారు రేపు 
శాసనమండలిలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలు డి.రాజేశ్వర్‌రావు, ఫా రూక్‌ హుస్సేన్‌ ఈ ఏడాది మేలో ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటున్నారు. ఈ స్థానాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశముంది.

ఈ నేపథ్యంలో ఈ నెల 9న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే కేబినెట్‌ భేటీలో అభ్యర్థులను ఎంపిక చేసి గవర్నర్‌కు సిఫారసు చేయనున్నా రు. రాజేశ్వర్‌రావు, ఫారూక్‌ హుస్సేన్‌ ఇద్దరూ మైనారిటీ వర్గానికి చెందిన వారు కావడంతో కొత్త అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ నెలకొంది. రిటైర్‌ అవుతున్న ఇద్దరూ ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్సీలుగా పనిచేశారు. రాజేశ్వర్‌రావుకు మరోమారు అవకాశం దక్కుతుందని సమాచారం.  

గౌడ సామాజికవర్గం నుంచి.. 
ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్‌ రిటైర్‌ అవుతుండటంతో మండలిలో గౌడ సామాజికవర్గానికి ప్రాతినిథ్యం లేకుండా పోతోంది. దీంతో గవర్నర్‌ కోటాలో మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌ లేదా గంగాధర్‌గౌడ్‌కు అవకాశం దక్కుతుందని అంటున్నారు.

గతంలో గవర్నర్‌ కోటాలో పాడి కౌశిక్‌రెడ్డి పేరును కేబినెట్‌ సిఫారసు చేసినా గవర్నర్‌ తిరస్కరించడాన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక ఉంటుందని సమాచారం. ప్రొఫెసర్‌ గంటా చక్రపాణి పేరు కూడా గవర్నర్‌ కోటాలో సిఫారసు చేసే అంశం సీఎం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.  

వ్యూహాత్మకంగా అభ్యర్థుల ఎంపిక 
ఈ నెలాఖరులో పదవీకాలం పూర్తి చేసుకుంటున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్‌రావు, ఎలిమినేటి కృష్ణారెడ్డి, వి.గంగా«ధర్‌ గౌడ్‌లో నవీన్‌రావు ఒక్కరికే రెండోసారి అవకాశం దక్కింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేస్తున్న బృందంలో ఈయ న కీలకంగా పనిచేస్తున్నారు. ఇక తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తిలో కీలకపాత్ర పోషించిన దేశపతి శ్రీనివాస్‌ రాష్ట్ర ఆవిర్భావం నుంచి సీఎం కార్యాలయ ఓఎస్‌డీగా పనిచేస్తున్నారు.

ఆయనకు కేసీఆర్‌తో సాన్నిహిత్యం ఉన్నా సుదీర్ఘ కాలం తర్వాతే అవకాశం లభించింది. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వా త ఆలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి కేసీఆర్‌ సమక్షంలో పార్టీ లో చేరారు. బీఆర్‌ఎస్‌లో వెంకట్రామిరెడ్డిది తొలి చేరిక కాగా, నడిగడ్డ ప్రాంతంలో రాజకీయ ప్రాబల్యం కలిగిన నేతగా ఆయనకు పేరుంది. ఆలంపూర్, కొల్లాపూర్, గద్వాల నియోజకవర్గాలతో పాటు ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో బీఆర్‌ఎస్‌ విస్తరణకు చల్లా సేవలను వినియోగించుకునే ఉద్దేశంతో ఆయన్ను ఎంపిక చేసినట్లు సమాచారం.  

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నేపథ్యమిదీ..
దేశపతి శ్రీనివాస్‌: తెలంగాణ కవి, గాయకుడైన దేశపతి శ్రీనివాస్‌ 1970లో సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని మునిగడప గ్రామంలో దేశపతి గోపాలకృష్ణ శర్మ, బాలసరస్వతి దంపతులకు జన్మిం చారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం.. ఉద్యమ నాయకుడిగా నాడు కేసీఆర్‌ నిర్వహించిన వేలాది సభలు, సమావేశాలు, ర్యాలీలలో పాల్గొన్నారు. తన ఆట, పాటలు, ప్రసంగాలతో తెలంగాణ భావజాల వ్యాప్తికి కృషి చేశారు. రాష్ట్ర సాధన అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం సీఎం ఓఎస్డీగా పని చేస్తున్నారు.  

కుర్మయ్యగారి నవీన్‌రావు: హైదరాబాద్‌ కూకట్‌పల్లికి చెందిన కుర్మయ్యగారి నవీన్‌రావు..కొండల్‌రావు, తిలోత్తమ దంపతులకు 1978 మే 15న జన్మించారు. నవీన్‌రావు తాత రామచంద్రరావు గతంలో మంత్రిగా పనిచేశారు. మేనమామ సుదర్శన్‌ రావు టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. నవీన్‌రావుకు విద్యార్థి దశ నుంచే రాజకీయాలంటే ఆసక్తి. 2001 నాటి జలదృశ్యం ఆవిర్భావ సభ మొదలుకొని టీఆర్‌ఎస్‌ నిర్వహించిన అన్ని సమావేశాల్లో క్రియాశీలంగా పనిచేశారు. తొలిసారిగా 2019 మేలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.  

చల్లా వెంకట్రామిరెడ్డి: మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు (కూతురి కొడుకు) అయిన చల్లా వెంకట్రామిరెడ్డి 1971లో నిర్మలమ్మ, రామ్‌భూపాల్‌ రెడ్డి దంపతులకు జన్మించారు. గుల్బర్గాలో బీటెక్‌ చదివిన ఈయన పుల్లూరు గ్రామ ప్రెసిడెంట్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తర్వాత 2004 నుంచి 2009 వరకు ఆలంపూర్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు. గత ఏడాది డిసెంబర్‌లో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.   

మరిన్ని వార్తలు