గవర్నర్‌ వ్యవస్థపై చర్చ జరగాల్సిందే   

31 Jan, 2023 01:31 IST|Sakshi

బీఆర్‌ఎస్‌ ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు   

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని గవర్నర్‌ వ్యవస్థపై పార్లమెంట్‌ సమావేశాల్లో చర్చ జరగాలని బీఆర్‌ఎస్‌ కేంద్రాన్ని డిమాండ్‌ చేసింది. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో బీఆర్‌ఎస్‌ ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావులు పాల్గొని పార్టీ వైఖరిని కేంద్ర ప్రభుత్వానికి తెలియచేశారు.

అనంతరం వీరిద్దరూ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ కోసం కోర్టు సహాయం కోరాల్సి రావడం వంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ ఎదురుకాలేదన్నారు. బడ్జెట్‌కు ఆమోదం తెలపకుండా గవర్నర్‌ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ, ఢిల్లీ, తమిళనాడు, కేరళసహా అనేక రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు గవర్నర్‌ వ్యవస్థతో ఇబ్బందులు పడుతున్నాయని.. అందువల్ల గవర్నర్‌ వ్యవస్థతో పాటు సమాఖ్య వ్యవస్థపై పార్లమెంట్‌లో చర్చ జరగాలన్నారు.

అంతేగాక అఖిలపక్ష సమావేశంలో రైతుల పంటల మద్దతు ధర రెట్టింపు చేయలేదన్న అంశంతో పాటు, నిరుద్యో గం అంశంపైనా చర్చ జరగాలని కోరామన్నారు. వీటితో పాటు పార్లమెంట్‌ సమావేశాలు కేవలం బిల్లుల ఆమోదం కోసం ఏర్పాటు చేయడం కాదని... ప్రజా సమస్యలతో పాటు దేశంలోని అనేక సమస్యలపై చర్చ జరపాలని కోరా మని కేకే, నామా తెలిపారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన సమస్యలను పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో లేవనెత్తి పోరాడతామని పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు