మరో ‘మహా’సభపై బీఆర్‌ఎస్‌ ఫోకస్‌

22 Mar, 2023 02:06 IST|Sakshi

26న నాందేడ్‌ సమీపంలోని కాందార్‌ లోహలో కేసీఆర్‌ అధ్యక్షతన సభ 

ఇప్పటికే డిజిటల్‌ ప్రచార రథాలతో తెలంగాణ పథకాలపై ప్రచారం 

సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి 

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నేపథ్యంలో చేరికలపై దృష్టి 

సాక్షి, హైదరాబాద్‌: మహారాష్ట్రలో కార్యకలాపాల విస్తరణపై భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) దృష్టిపెట్టింది. ఫిబ్రవరి 5న నాందెడ్‌లో జరిగిన తొలి సభ సక్సెస్‌ అయిన నేపథ్యంలో ఈ నెల 26న నాందేడ్‌కు 35 కి.మీ. దూరంలోని కాందార్‌ లోహలో సైతం భారీ బహిరంగ నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది.

బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఈ సభకు అధ్యక్షత వహించనుండటంతో జన సమీకరణను బీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. లక్షకు మందికిపైగా ప్రజలను ఈ సభకు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ సభ ద్వారా లాతూర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో బీఆర్‌ఎస్‌ ప్రభావం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

సభ ఏర్పాట్ల బాధ్యతను తెలంగాణ పీయూసీ చైర్మన్, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితోపాటు బీఆర్‌ఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ, పార్టీ మహారాష్ట్ర శాఖ కిసాన్‌సెల్‌ అధ్యక్షుడు మాణిక్‌ కదం పర్యవేక్షిస్తున్నారు.  

తెలంగాణ మోడల్‌కు ప్రాధాన్యత... 
కాందార్‌ లోహ బహిరంగ సభకు జన సమీకరణ కోసం కసరత్తు చేస్తున్న బీఆర్‌ఎస్‌ మహారాష్ట్ర గ్రామాల్లో తెలంగాణ మోడల్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి తదితర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను ప్రచారం చేసేందుకు 20 ప్రచార రథాలు, 16 డిజిటల్‌ స్క్రీన్‌ ప్రచార వాహనాలను ఉపయోగిస్తోంది.

16 తాలూకాల పరిధిలోని 1,600 గ్రామాల్లో తెలంగాణ మోడల్‌ను విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఈ ప్రచార రథాలను ఉపయోగిస్తోంది. ఓవైపు తెలంగాణ మోడల్‌కు విస్తృత ప్రచారం కల్పించడంతోపాటు కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ వైఫల్యాలను వీడియోలు, ఇతర ప్రచార సామగ్రి రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రణాళికను అమలు చేస్తోంది.

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ సభా వేదిక ద్వారా ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో చేరికల కోసం కసరత్తు జరుగుతోంది. సభలో వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు బీఆర్‌ఎస్‌లో చేరతారని చెబుతున్నా క్షేత్రస్థాయి కేడర్‌ను చేర్చుకొనేందుకే పార్టీ ప్రాధాన్యమిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే నాటికి నాందెడ్, ఔరంగాబాద్, బీడ్, ఉస్మానాబాద్, షోలాపూర్‌ తదితర ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు బీఆర్‌ఎస్‌ వ్యూహాలు రచిస్తోంది. 

కర్ణాటక ఎన్నికలపై నజర్‌... 
త్వరలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీపై ఎలాంటి కదలికలు లేకున్నా అక్కడి రాజకీయ పరిస్థితులపై బీఆర్‌ఎస్‌ అధ్యయనం చేస్తోంది. కర్ణాటక రాజకీయాలపై సర్వే సంస్థల ద్వారా ఫీడ్‌బ్యాక్‌ను ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కర్ణాటక రాజకీయాల పరిశీలనకు త్వరలో సీఎం కేసీఆర్‌ ఒక బృందాన్ని నియమించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.  

మరిన్ని వార్తలు