బీజేపీపై విమర్శలు..‘కూటమి’ సంకేతాలు

19 Jan, 2023 00:38 IST|Sakshi

ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ సభ సాగిన తీరు

విపక్షాలు ఏకం కావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన కేసీఆర్‌

బీజేపీ, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని ప్రసంగం

తెలంగాణ మోడల్‌కు విస్తృత ప్రచారం కల్పించే ప్రయత్నం

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌ రాష్ట్ర సమితి ఆవిర్భావం తర్వాత ఖమ్మం వేదికగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన బుధవారం జరిగిన బహిరంగ సభ.. కేంద్రంలోని అధికార బీజేపీ లక్ష్యంగా సాగింది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పనితీరును ‘మూర్ఖుల అసమర్థ పాలన’గా పేర్కొన్న కేసీఆర్, విపక్షాలు ఏకం కావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మోదీ ప్రభుత్వం తప్పులను ‘విపక్షాల ప్రభుత్వం’ సరిదిద్దుతుందని ప్రకటించడం ద్వారా రాబోయే రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటులో తాను కీలకపాత్ర పోషిస్తాననే విషయం స్పష్టం చేశారు.

సీపీఎం, సీపీఐ వంటి క్రియాశీల, ప్రగతిశీల పార్టీలతో దేశ వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ కలిసి పనిచేస్తుందనడం ద్వారా ‘ప్రత్యామ్నాయ కూటమి’ దిశగా కసరత్తు జరుగుతోందనే సంకేతాలు ఇచ్చారు. బీజేపీ, ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించిన కేసీఆర్, బీఆర్‌ఎస్‌ జాతీయ పాలసీని స్థూలంగా వివరించారు. బీఆర్‌ఎస్‌ జాతీయ విధానంపై కసరత్తు జరుగుతోందని చెప్తూనే వివిధ రంగాల్లో బీఆర్‌ఎస్‌ చేపట్టనున్న సంస్కరణలను వివరించారు. మరోవైపు తెలంగాణ మోడల్‌ను దేశానికి పరిచయం చేస్తామనే విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు.

తెలంగాణ మోడల్‌ పరిచయం...
రెండు రోజులుగా తెలంగాణ పర్యటనలో ఉన్న ముగ్గురు ముఖ్యమంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పాలన విధానాలు, ప్రభుత్వ పథకాలను పరిచయం చేసేందుకు కేసీఆర్‌ ప్రాధాన్యతనిచ్చారు. యాదాద్రి పర్యటన ద్వారా సీఎంలు.. హిందుత్వం బీజేపీ సొత్తు కాదని చాటిచెప్పే ప్రయత్నం చేశారు. ఖమ్మం కలెక్టరేట్‌ సముదాయం, కంటి వెలుగు రెండో విడత ప్రారంభ కార్యక్రమాల్లో ముగ్గురు సీఎంలను భాగస్వాములను చేయడం ద్వారా తెలంగాణ మోడల్‌కు విస్తృత ప్రచారం కల్పించే ప్రయత్నం చేశారు.

కేంద్రం విధానాల వల్లే బీఆర్‌ఎస్‌కు దగ్గర
నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలను ప్రశ్నిస్తు న్నందునే తాము బీఆర్‌ఎస్‌కు దగ్గరవుతున్నట్లు ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు చెప్పారు. ఖమ్మం సభకు హాజరైన ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్‌ మాన్, పినరయి విజ యన్‌తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా.. బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. గవర్నర్ల వ్యవస్థను బీజేపీ దుర్వినియోగం చేస్తున్న తీరును ఎండగట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను ఎమ్మెల్యేల కొనుగోలు ద్వారా కూలదోస్తోందంటూ.. ఢిల్లీ, తెలంగాణ ఉదంతాలను ప్రస్తావించారు.  

దేశ వ్యాప్తంగా విపక్ష ఐక్యతా సభలు
తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తిలో భారీ బహిరంగ సభల నిర్వహణను ఒక వ్యూహంగా అమలు చేసిన కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ విస్తరణలోనూ అదే తరహా కార్యాచరణ ఉండాలనే భావనతో ఉన్నట్లు ఖమ్మం సభ ద్వారా తేటతెల్లమైంది. ఖమ్మం నూతన కలెక్టరేట్‌లో మధ్యాహ్న భోజనం తర్వాత ముగ్గురు ముఖ్యమంత్రులతో పాటు అఖిలేశ్‌తో జరిగిన భేటీలో.. ఆయా రాష్ట్రాల్లో విపక్ష ఐక్యతా సభల పేరిట భారీ బహిరంగ సభల నిర్వహణపై చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆప్, కమ్యూనిస్టు పార్టీలు, సమాజ్‌వాదీ పార్టీలు నిర్వహించే బహిరంగ సభల్లో తమ భాగస్వామ్యం ఉంటుందని కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది.

బీఆర్‌ఎస్, ఆప్, సమాజ్‌వాదీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పాటు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటులో కలిసి వచ్చే పార్టీలు, శక్తులపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. కూటమి ఏర్పాటుపై తొందరపాటు ప్రకటన చేయకుండా, బీజేపీ వైఫల్యాలను ఉమ్మడిగా ఎండగట్టడంపైనే ప్రస్తుతానికి దృష్టి కేంద్రీకరించాలనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైనట్లు తెలిసింది. త్వరలో ఏపీలో కూడా బహిరంగ సభ నిర్వహించే యోచనలో ఉన్న కేసీఆర్‌ ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లో కలిసి వచ్చే పార్టీలతో కలిసి భారీ సభలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు